శభాష్‌ ఈసీ.. ఉన్న చోటు నుంచే సొంతూళ్లో ఓటేసుకోవచ్చు?

మన దేశ ప్రజాస్వామ్యానికి మూల స్థంభం మన ఓటు.. ఓటు హక్కుతోనే నేతల తలరాతలు మారిపోతుంటాయి. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో చాలా వరకూ 60 శాతం ఓటింగ్‌ దాటడం లేదు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ప్రధాన కారణం మాత్రం.. ఓటు ఎక్కడ ఉందో.. అక్కడే ఉపాధి లభించకపోవడమే. చాలా మంది బతుకు దెరువు కోసం వలస పోతుంటారు. వలస కార్మికుల సంగతి చెప్పనక్కర్లేదు. వారంతా ఓటు కోసం సొంత ఊరికి రావాలంటే అంత సులభం కాదు.

అప్పటికీ రాజకీయ పార్టీలు వారికి రవాణా సౌకర్యం కల్పించి ఓటు కోసం సొంత ఊరికి రప్పిస్తుంటాయి కానీ.. అది అతి కొద్ది శాతం మాత్రమే. మరి ఇలాంటి 60 శాతం ఓట్లతో వచ్చే తీర్పు ప్రజాస్వామ్యానికి మంచిదేనా.. ఏమాత్రం కాదు.. అందుకే ఓటింగ్ పెంచేందుకు ఈసీ ఓ కొత్త ప్రయోగం చేస్తోంది. దేశీయ వలస ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ.. రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ను అభివృద్ధి చేసింది. ఈ రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ గురించి వచ్చేనెల 16న    రాజకీయ పార్టీలకు ఈసీ వివరించనుంది.

ఈ రిమోట్‌ ఓటింగ్‌ యంత్రం ద్వారా దేశంలో ఎక్కడ ఉన్నా.. దగ్గర ఉన్న పోలింగ్‌ బూత్‌లో మన సొంత ఊరి ఓటు వేసుకోవచ్చు. అయితే.. ఈ కొత్త యంత్రం ద్వారా ఓటింగ్‌ అమలు వల్ల ఏర్పడే న్యాయ, పరిపాలన, సాంకేతిక సవాళ్లపై రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోబోతోంది. ఈ యంత్రం ద్వారా సింగిల్‌ రిమోట్‌ పోలింగ్‌ బూత్‌ ద్వారా 72 నియోజకవర్గాలను నియంత్రించే అవకాశం ఉంది. ఈ రిమోట్‌ ఈవీఎంను ప్రభుత్వ రంగ సంస్థే అభివృద్ధి చేసింది.

ప్రధానంగా పట్టణ ఓటర్లు, యువత ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ  రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ను అభివృద్ధి చేసినట్టు ఈసీ చెబుతోంది. ఈ రిమోట్ ఓటింగ్ ఎన్నికల ప్రజాస్వామ్యాన్నిబలోపేతం చేస్తుందని ఈసీ భావిస్తోంది. ఈ కొత్త యంత్రం పరివర్తనకు నాంది పలకనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: