తెలంగాణ సంపదపై ఆంధ్ర నేతలు కన్నేశారా?

తెలంగాణలో ఆంధ్రానేతల సందడి పెరిగింది. ఇప్పటికే షర్మిల ఇక్కడ పార్టీ పెట్టి యాత్రలు చేస్తోంది. పవన్ కూడా ఇక్కడ పోటీ చేస్తానంటున్నాడు. ఇప్పటికే కేఏ పాల్ కూడా పోటీ చేసేశాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఖమ్మం సభ ద్వారా మళ్లీ తెలుగుదేశాన్ని తెలంగాణలో యాక్టివ్ చేస్తున్నారు. అయితే.. ఇదంతా తెలంగాణ సంపద కోసమేనట.. ఈ మాటలు అంటున్నది తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సంపద పెరిగిందని.. హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని.. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్  అంటున్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వై.ఎస్. బిడ్డ వెరైటీ ముసుగుతో ఇక్కడకొచ్చిందని.. పవన్ కల్యాణ్, కేఏ పాల్ కూడా వచ్చారని.. తెలంగాణ సంపదపై వీరంతా కన్నేశారని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్  అంటున్నారు. ఇప్పుడు అసలు మనిషి చంద్రబాబు ఎంటరయ్యాడని.. పాత బిడ్డల్లారా రండి అంటున్నడని.. డిఫరెంట్ వేషాల్లో వీళ్లంతా  వచ్చినా అందరూ ఒకే తాను ముక్కలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్  గుర్తు చేస్తున్నారు. మళ్లీ రాష్ట్రాన్ని కలపాలన్నదే వీరి ఎజెండా అంటున్న  గంగుల కమలాకర్.. వీరు మళ్లీ 1956 నవంబర్  1 గుర్తుకు తెస్తున్నారన్నారు.

ఉమ్మడి ఏపీని సాధించే ప్రయత్నంలో భాగమే చంద్రబాబు ఎంట్రీ అన్న  గంగుల కమలాకర్.. మీ మూలాలు ఎక్కడ? ఏపీ మూలాలున్న మీకు తెలంగాణ గడ్డపై ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాలు జూన్ 2నే ఏర్పడినా చంద్రబాబు ఆరోజు ప్రమాణం చేయలేదని.. ఖమ్మం నుంచి ఏడు మండలాలు కలిపేదాకా ప్రమాణం చేయనన్న వ్యక్తి చంద్రబాబని అన్నారు. సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబన్న  గంగుల కమలాకర్.. వీరందరి వెనక బీజేపీ ఉందని విమర్శించారు.

హైద్రాబాద్ సంపదను, మన నీళ్లను ఎత్తుకుపోయే  కుట్రలో భాగమే ఇదంతా అంటున్న గంగుల కమలాకర్ తెలంగాణ ప్రజలు మేల్కోవాలి. తిరుగుబాటు మొదలు పెట్టకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని అన్నారు. మన బొగ్గు, మన కరెంట్ ఎత్తుకుపోతారని.. తెలంగాణ రక్తం ఉన్న వాళ్లెవరూ చంద్రబాబు పార్టీలో చేరరని కమలాకర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: