జగన్ జాగ్రత్త.. అప్పుడు ఈ లెక్కలే బాబును ముంచాయి?

అధికారంలో ఉన్నవారు.. తమ పాలన అంతా బావుందనుకుంటారు. అధికారంలో ఉన్న సీఎం, పీఎంలకు చుట్టూ ఉన్న అధికారులు కూడా అలాంటి విషయాలే చెబుతారు.. ఆహో.. ఓహో.. మీ పాలన అదుర్స్ అంటూ భజన చేస్తారు.. కానీ.. అసలు వాస్తవాలు వేరేగా ఉంటాయి. ఆ అసలు దృశ్యాన్ని చూసేందుకు పాలకులకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ.. అదే కొంప ముంచుతుంది. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే జరిగింది.

అప్పట్లో ఆర్టీజీఎస్‌ అంటూ ఓ సిస్టమ్ ఉండేది. అంతా ఆన్‌లైన్‌లో డేటా రెడీగా ఉందని చంద్రబాబు చెప్పేవారు.. దాని ప్రకారం ప్రజల సంతృప్తి స్థాయి 90 శాతం దాటిందని అప్పట్లో అధికారులు చెప్పేవారు.. అది చూసి చంద్రబాబు కూడా బోల్తా పడ్డారు. తీరా చూస్తే.. జనం చిత్తు చిత్తుగా ఓడించారు. అసలు తెలుగు దేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పడూ లేనంత చిత్తుగా ఓడించారు. ఇప్పుడు జగన్ విషయంలోనూ ఇదే జరుగుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఎందుకంటే కొందరు మంత్రులు చెబుతున్న మాటలు అలాగే ఉన్నాయి. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇలాగే మాట్లాడారు..  రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు 98.44% అందించడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాయదుర్గం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి పెద్దిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. 2024 ఎన్నికల్లో వైకాపా విజయమే నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఇలా పని చేయాలని కోరడం మంచిదే కానీ.. అంతా అద్భుతంగా ఉంది.. కాబట్టి మనమే గెలుస్తామన్న దీమాతో ఉంటే ప్రమాదమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: