పవన్ కల్యాణ్‌ పై కేసు.. అరెస్టు చేస్తారా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు పోలీస్ కేసు నమోదు చేశారు. తెనాలిలోని మారిస్ పేటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ పై ఐపిసి సెక్షన్ 336, 279, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 177 కింద తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈనెల 5వ తేదిన తాను తెనాలి నుంచి తాడేపల్లి వెళ్తుండగా జాతీయ రహదారిపై జనసేన నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్తున్నారని.. ఆ గందరగోళంలో తాను వాహనం నుంచి కిందపడి గాయాల పాలయ్యానని పేర్కొన్నారు.

ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా జాతీయ రహదారిపై వెళ్లటం, ర్యాష్ డ్రైవింగ్ వంటి కారణాలను చూపిస్తూ కేసు నమోదు చేయాలని శివకుమార్ ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదిన శివకుమార్ నుంచి ఈ ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఫిర్యాదు మేరకు పవన్  కళ్యాణ్ తో పాటు ఆయన డ్రైవర్ పైనా కేసు నమోదైంది. అయితే.. ఘటన జరిగిన 5రోజుల తర్వాత ఫిర్యాదు వచ్చింది. అంతే కాదు.. ఫిర్యాదు అందిన రెండు రోజుల తర్వాత కేసు పెట్టారు.

అసలేమైందంటే.. తాడేపల్లి మండలం ఇప్పటంలో ఈనెల 4న రోడ్డు విస్తరణ పేరుతో ప్రజల ఇళ్లలో కొంత భాగాలను అధికారులు కూల్చివేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లి బాధితుల్ని పరామర్శించాలని భావించారు. అక్కడకు వాహనంలో వెళ్తున్న సమయంలో పోలీసులు పవన్ ని అడ్డుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కాస్త హల్ చల్ చేశారు.

ఏకంగా కారుపైకి ఎక్కి కూర్చుని కాన్వాయ్‌తో హల్ చల్ చేశారు. ఆ సమయంలో తీసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పవన్ తీరుపై అప్పుడే విమర్శలు వచ్చాయి.  కొందరు వైసీపీ నేతలు... పవన్ పై కేసు పెట్టొచ్చని కూడా మాట్లాడారు. ఇప్పుడు కేసు నమోదైంది. మరి ఈ కేసు నిలబడుతుందా.. ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తుందా.. లేక ఏదో నామ్‌ కే వాస్తే గా చూస్తుందా అన్నది తేలాలి. ఇక ఈ కేసులో పవన్ పై నమోదైన సెక్షన్ల ప్రకారం రూ 200 నుంచి వెయ్యి రూపాయల వరకూ జరిమానా పడే అవకాశం ఉంది. అలాగే నేరం రుజువైతే  2నుంచి 3నెలల వరకూ సాధారణ జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: