ఏపీకి తెలంగాణ బిగ్‌షాక్‌.. మీరే 12 వేల కోట్లు ఇవ్వాలి?

ఏపీ, తెలంగాణ విద్యుత్ బకాయిల అంశం మరోసారి రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి తెలంగాణ విద్యుత్  బకాయిలు చెల్లించాలని ఇటీవల కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపికి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపి పునర్విభజన చట్టం ప్రకారం ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్రం తాజాగా ఆదేశించింది.

అసలేం జరిగిందంటే.. 2014 జూన్ 2 తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ డిస్కం లు తెలంగాణకు 2017 జూన్ 10 తేదీ వరకూ విద్యుత్ ను సరఫరా చేశాయి. అయితే.. ఇలా సరఫరా చేసిన విద్యుత్‌కు తెలంగాణ డిస్కమ్‌లు ఇంత వరకూ నగదు చెల్లించలేదని ఏపీ అంటోంది. ఈ అంశంపై ఏపీ చాలా సార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ అంశం ఢిల్లీలో  కేంద్రం వద్ద ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉండిపోయింది. ఏపీ సీఎం జగన్ డిల్లీ వెళ్లినప్పుడల్లా ఈ బకాయిలు ఇప్పించాలని కోరుతూనే ఉన్నారు.

ఈ అంశంపై ఇన్నాళ్లకు ఇప్పుడు కేంద్రం స్పందించింది. మొత్తం 3441.78 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని.. అయితే.. 2022 జూలై 31 తేదీ వరకూ ఆలస్య రుసుము కింద మరో 3315 కోట్ల రూపాయలు చెల్లించాలని కేంద్రం తాజాగా ఆదేశాలిచ్చింది. అంటే నెల రోజుల్లో 6, 750 కోట్ల రూపాయల మొత్తాన్ని ఏపి కి తెలంగాణ కట్టాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఆదేశించారు. అయితే ఇప్పుడు ఈ ఆదేశాలపై తెలంగాణ మండిపడుతోంది.

కేంద్రం జారీ చేసిన ఈ ఆదేశాలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని తెలంగాణ విద్యుత్  శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. డబుల్  ఇంజిన్  ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇవ్వలేని విధంగా.... తెలంగాణలో కరెంట్  సరఫరా చేస్తున్నామని.. ఆ అక్కసుతోనే... బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణ విద్యుత్  శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. అంతే కాదు.. తెలంగాణ రాష్ట్రానికే ఏపీ నుంచి 12, 941 కోట్లు బకాయిలు రావాలని జగదీశ్ రెడ్డి అంటున్నారు. మరి ఈ పంచాయతీ ఎప్పుడు తేలుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: