టీచర్లకు జగన్ షాక్.. సెప్టెంబర్‌ 1 నుంచి తప్పదా?

ప్రభుత్వ ఉపాధ్యాయులకు జగన్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా హాజరు వేయాల్సిందన్న నిబంధనను సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం స్కూల్ అటెండెన్సు యాప్ ద్వారా ఉపాధ్యాయులంతా సెప్టెంబరు 1 తేదీ నుంచి హాజరు నమోదు చేయాల్సిందే. అలా చేయకపోతే.. హాజరును పరిగణనలోకి తీసుకోరు.

ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు వారు తప్ప మిగతా ఉపాధ్యాయులంతా ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్  ద్వారానే హాజరు నమోదు చేయాలి. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలో పనిచేస్తున్న భోధనేతర సిబ్బంది కూడా ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలి. ఇకపై  మాన్యువల్ అటెండెన్సును ఎట్టిపరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరు. కేవలం చూపులేని దివ్యాంగులకు మాత్రమే మాన్యువల్ అటెండెన్స్ కు అవకాశం ఉంటుంది.

అయితే.. కొందరు తమ వద్ద ఆండ్రాయిడ్ ఫోన్‌ లేదని చెబుతున్నారు. ఇలాంటి ఆండ్రాయిడ్ ఫోన్లు లేని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ప్రధానోపాద్యాయుడు ఫోన్లను హాజరు కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఆగస్టు 31 తేదీ లోగా టీచర్లు, బోధనేతర సిబ్బంది హాజరు నమోదు కోసం రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోని అన్ని కార్యాలయాల అధికారులు, సిబ్బంది కూడా అటెండెన్సు యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకోవాలి.

రాష్ట్రస్థాయి, జోనల్, రీజినల్, ఎంఈఓ కార్యాలయాలు కూడా హాజరు కోసం ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ నే వినియోగించాలి. 2022 సెప్టెంబరు 1 తేదీ నుంచి స్కూల్ అటెండెన్సు యాప్ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. గతంలో ఈ యాప్ వినియోగంపై టీచర్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా హాజరు నమోదుకు ఉపాధ్యాయ సంఘాలు ససేమిరా అంటున్నాయి. ప్రభుత్వం హాజరు నమోదుకు తగిన యంత్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ ఫోన్లు వాడితే తమ డాటాకు భద్రత ఉండదని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: