పాకిస్తాన్‌ను అగ్రదేశాలు అలా వాడుకుంటున్నాయా?

మన పొరుగు దేశం పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ దేశ విదేశీ నిల్వలు దాదాపు నిండుకున్నాయి. అయితే.. ఈ ఇబ్బందిని అగ్రదేశాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయట. ఎలక్ట్రానిక్ చెత్తను వదిలించుకోవడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సమస్యగా ఉంది. అందుకే కొన్ని అగ్రదేశాలు తమ ఈ చెత్తను పాకిస్తాన్‌లో డంప్‌ చేస్తున్నాయట. ఇప్పుడు ఇది పాకిస్తాన్‌లో ఓ ప్రధాన సమస్యగా మారిందట.

విచిత్రం ఏంటంటే.. ఇలా  అమెరికా, బ్రిటన్‌, జర్మనీ సహా కెనడా, ఇటలీ, సౌదీ అరేబియా వంటి దేశాల తమ ఈ చెత్తను పాకిస్తాన్లో డంప్ చేస్తున్నాయన్న విషయం ఆ దేశ నాయకులకు కూడా పెద్దగా అవగాహన లేదట. అగ్ర దేశాల నుంచి పాకిస్థాన్‌ చెత్తను దిగుమతి చేసుకుంటోందని తెలుసుకున్న ఆ దేశ సెనేట్ స్టాండింగ్ కమిటీ ఆశ్చర్యానికి గురైందట. ఈ విషయాన్ని ఓ పాకిస్తాన్ పత్రిక బయటపెట్టింది.

మరి పాక్ ఎందుకు ఇలా దిగుమతి చేసుకుంటుందంటే.. ఇలా ఈ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి.. వాటి నుంచి బంగారం‌, కాపర్‌, అల్యూమినియం వంటి ఖనిజాలను తయారు చేస్తున్నారట. ఇలా కొంత ఆదాయం వస్తోంది. అయితే.. వచ్చే ఆదాయం కంటే.. ఆ దేశ పర్యావరణానికి జరిగే నష్టం ఎక్కువని పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ కొద్ది మొత్తం కోసం భారీగా వ్యర్థాలను దిగుమతి చేసుకోవడం దారుణమని వాదిస్తున్నాయి.

ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు ఇప్పుడు పాకిస్థాన్ డంపింగ్ యార్డుగా మారిందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సెనేటర్ ఫైసల్ జావేద్ విమర్శించారు. పాకిస్తాన్‌లోని పలు నగరాల్లోని వీధులు వ్యర్థాలతో విషపూరితంగా మారుతున్నాయని ఆయన చెబుతున్నారు. ఇలా దిగుమతి చేసిన వ్యర్థాలు అంగీకరించలేమని ఫైసల్ జావేద్ అంటున్నారు. పాకిస్తాన్‌ను ‘దిగుమతి చేసుకున్న ప్రభుత్వం’ పరిపాలిస్తోందన్న తన పార్టీ చీఫ్‌ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను జావేద్‌ కోట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: