ఈటెలతో ఒక్క ఫోటో.. శభాష్ అనిపించుకున్న కేటీఆర్!

ఈటెల రాజేందర్.. ఒకప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో కీలక నాయకుడు.. ప్రజాదరణలోనూ వాగ్దాటిలోని సమర్థతలోనూ కేసీఆర్, హరీశ్ రావు తర్వాత స్థానంలో ఉండే నాయకుడు.. గతంలో కేసీఆర్ ఎంపీగా గెలిచినప్పుడు అసెంబ్లీలో టీఆర్ఎస్‌ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నడిపించిన వాడు. నక్సలిజం భావజాలం నుంచి వచ్చిన ప్రజానాయకుడిగా ఈటెల రాజేందర్‌కు పేరు. అందులోనూ ముదిరాజ్ వంటి వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చిన ఈటెల రాజేందర్.. టీఆర్ఎస్‌లో మంచి స్థానం సంపాదించుకున్నారు.

కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా.. వైద్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఈటెల.. అయితే.. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈటెలకూ కేసీఆర్‌ కూ చెడింది. అది ఏ విషయం అన్న విషయంపై క్లారిటీ లేకపోయినా ఒక్కసారిగా ఈటెలపై కేసీఆర్  పగబట్టినట్టే చేశారు. ఈటెల అసైన్డ్ భూములు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై హుటాహుటిన కేసులు నమోదు చేసి.. చివరకు పదవి నుంచి సైతం తొలగించారు. పార్టీ నుంచి అత్యంత అవమానకరంగా ఈటెలను బయటకు పంపారు.

ఈటెల కూడా ఏమీ వెనుక్కు తగ్గలేదు. ఎమ్మెల్యేగా సైతం రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్‌తో తేల్చుకుంటానని సవాల్ చేశారు. బీజేపీలో చేరిన ఈటెల తాను అనుకున్న పని చేశారు. అధికార పార్టీని సైతం ఎదిరించి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ఈటెల ముఖం చూడకూడదని కేసీఆర్ భావించారని.. అందుకే అసెంబ్లీ నుంచి మొదటి రోజే సస్పెండ్ చేయించారని ఊహాగానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తండ్రి కేసీఆర్ తీరుకు పూర్తి భిన్నంగా మంత్రి కేటీఆర్ వ్యవహరించారు. సమావేశాల తొలిరోజు ఈటెల రాజేందర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు. కేటీఆర్ సభలోకి వచ్చాక.. అప్పటికే సీట్లో ఉన్న విపక్ష సభ్యుల వద్దకు వెళ్లారు. అక్కడ కనిపించిన  ఈటల రాజేందర్ ను అన్నా.. బాగున్నావా..అంటూ ఆప్యాయంగా పలకరించారు. అంతే కాదు.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. రాజకీయం రాజకీయమే.. పలకరింపు పలకరింపే అని  ఈ ఫోటో ద్వారా కేటీఆర్ చాటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: