టీడీపీలో ఆ సీనియర్లకు ఇక నో ఛాన్స్‌..!

VUYYURU SUBHASH
ఏపీలో సీనియర్ నేతలు ఎక్కువ ఉన్న పార్టీ ఏది అంటే... ఠక్కున టీడీపీ అని చెప్పేయొచ్చు. అధికార వైసీపీలో కూడా సీనియర్లు ఉన్నారు... కానీ టీడీపీలో ఉన్నంత మంది లేరు. ఎటు చూసుకున్నా టీడీపీలోనే సీనియర్లు ఎక్కువ. అలాగే ఎక్కువ నియోజకవర్గాల్లో సీనియర్ నేతలే టీడీపీ బాధ్యతలని చూసుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో తక్కువ మంది సీనియర్లు మాత్రమే జగన్ గాలిని తట్టుకుని గెలిచారు. చాలామంది సీనియర్లు దారుణంగా ఓడిపోయారు. ఇక ఆ ఓటమి నుంచి సీనియర్లు బయటపడుతూ వస్తున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో కొందరు సీనియర్లు పుంజుకున్నారు.

అలాగే వారు విజయం దిశగా ముందుకెళుతున్నారు. అయితే ఇంకా కొంతమంది పుంజుకోవాల్సిన అవసరముంది. ఆ సీనియర్ల గెలుపుపై ఇంకా నమ్మకం మాత్రం రాలేదు. మరి కొందరు సీనియర్లు అయితే ఇంకా వెనుకబడి ఉన్నారు. అలాంటి వారికి మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అలా కాస్త డౌట్‌తో ఉన్న సీనియర్లలో కిమిడి కళా వెంకట్రావు కూడా ఉన్నారు. ఈయన ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇంకా పుంజుకోవాలి. గజపతినగరంలో అప్పలనాయుడు రేసులో వెనుకబడ్డారు.

అటు తునిలో యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ సైతం చాలా వెనుకబడి ఉంది. 20 ఏళ్లుగా గెలుపు మ‌ర్చిపోయిన య‌న‌మ‌ల ఫ్యామిలీ ఎప్ప‌ట‌కి గెలుస్తుందో ?  కూడా తెలియ‌డం లేదు. అలాగే జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఇంకా పికప్ అవ్వాలి. రాజనగరంలో పెందుర్తి వెంకటేష్, ప్రత్తిపాడులో వరుపుల రాజా, నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు లాంటి నేతలు ఇంకా కష్టపడాల్సి ఉంది.

ఇక వరుసగా ఓడిపోతూ వస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి...సర్వేపల్లిలో ఇంకా పట్టు సాధించాలి. సోమిరెడ్డిని బాబు ఇప్ప‌ట‌కీ అయినా ప‌క్క‌న పెడితే మంచిద‌న్న కామెంట్లు వ‌స్తున్నాయి. ఉదయగిరిలో బొలినేని రామారావు, మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి, పెనుకొండలో బీకే పార్థసారథి, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు, ఆదోనిలో మీనాక్షి నాయుడు, గుంతకల్లులో జితేంద్ర గౌడ్, రాజంపేటలో చెంగల్రాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే...ఇంకా చాలామంది సీనియర్లు టీడీపీలో పికప్ అవ్వాల్సి ఉంది.

పైన చెప్పుకున్న నేతల్లో కొంద‌రు వైట్ ఎలిఫెంట్లుగా మారిపోయారు. వీరిని బాబు ఇప్ప‌ట‌కీ అయినా వదిలించుకోక‌పోతే ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు మ‌ర్చిపోవాల్సిందే. వచ్చే రెండున్నర ఏళ్లలో ఈ సీనియర్లు పుంజుకుంటే టీడీపీ గెలవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: