తిరుపతి ఎన్నికల్లో క్రైస్తవం గురుమూర్తికి చేటు చేస్తుందా..?

మన దేశంలో ఎన్నికలు అంటేనే ముందు కులం, మతం సమీకరణాలు ముందుకు వస్తాయి. ఇప్పుడు తిరుపతి ఎన్నికల విషయంలోనూ ఇదే విషయం ప్రస్తావనకు వస్తుంది. తిరుపతి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.. ఇక్కడ వైసీపీ తరపున గురుమూర్తి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో జగన్ వద్ద ఫిజియోథెరపిస్టుగా పని చేశారు. అయితే ఇప్పుడు ఈ స్థానంలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఆయన మతాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. గురుమూర్తి క్రిస్టియన్ అంటూ ప్రచారం చేస్తోంది.
సాధారణంగా క్రిస్టియానిటీ తీసుకున్న ఎస్సీలకు ఎస్సీ హోదా పోతుంది. హిందూ మతంలోనే కులాలు ఉన్నాయన్న కారణంతో మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు. ఇప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న బీజేపీ గురుమూర్తి ఎస్సీ కానే కాదని వాదిస్తున్నాయి. ఆయన క్రిస్టియన్ అంటూ పదే పదే గుర్తు చేస్తున్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ నేత సునీల్ దేవధర్ కూడా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.  
వైసీపీ మాత్రం ఈ అంశంలో ఎదురుదాడి చేస్తోంది. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్వయాన ద‌ళిత బంధువు, వారి క్షేమం కోరే వ్యక్తి అంటూ వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అంటున్నారు. సునీల్‌ దేవధర్‌ ఏంటో ఆయన పార్టీ ఏంటో అర్ధం కావడం లేదు. ఆయన తిరుపతిలో మా పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి గురించి మాట్లాడుతున్నాడు. గురుమూర్తి కులం, మతం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. డాక్టర్‌ గురుమూర్తి దళితుడు. ఆయన మావాడు. దళితులుగా ఈ రాష్ట్రంలో ఉన్న మా మతం ఏంటో నువ్వు అడుగుతావా? ఆయన కులం, మతం అడిగే అర్హత నీకుందా? అంటూ మండిపడ్డారు మేరుగ నాగార్జున.
నాగార్జున ఇంకా ఏమన్నారంటే.. “ ఏ దేవున్ని అయినా పూజించే అర్హత మాకుంది. మేము గుడికి వెళ్తాం. మసీదు కెళ్తాం. చర్చికెళ్తాం. అది మా ఇష్టం. దేవుడి గుళ్ళు పగలగొట్టిస్తావు. రధాలు తగలబెట్టిస్తావు. నీలాంటి ధర్డ్‌ క్లాస్‌ లీడర్స్‌కి సమాధానం చెప్సాల్సిన అవసరం లేదు. మేఘాలయాలో నువ్వేం చేశావు. తిరుపతిలో పవన్‌కళ్యాణ్‌ సినిమా కోసం రోడ్లమీదకు వెళ్ళే నీకు మా దళితులను ప్రశ్నించే హక్కు లేదు. మాకు ఆత్మగౌరవం ఉంది, మాకు అంబేద్కర్‌ ఆలోచన ఉంది. మీ కుయుక్తులు ఆపండి.. అంటూ విరుచుకుపడ్డారు. మరి తిరుపతి ఓటర్లు మతం చూసి ఓటేస్తారా.. పార్టీ చూసి వేస్తారా..అన్నది కొన్ని రోజుల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: