ఇంట్లో భార్యలని చూడటం మానేసి... వారం మొత్తం ఉద్యోగం చేయాలి అంట..!

Chakravarthi Kalyan

ఉద్యోగులు ఎంత సమయం పనిచేయాలి? వారంలో ఐదు రోజులు పనిచేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆరు రోజులు పనిచేస్తే దేశం ఆర్థికంగా పురోగమిస్తుందా? అసలు సెలవే లేకుండా వారంలో ఏడు రోజులూ పనిచేయడం వల్ల జరిగే నష్టం ఏంటి?విదేశాల్లో పనివేళలు కుదించి, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించమని ఉద్యోగులకు సూచిస్తుంటే మన దేశంలో ప్రైవేటు కంపెనీల అధినేతలు మాత్రం ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేయాలని కోరుకుంటున్నారు. దీనికి దేశాభివృద్ధికి ముడిపెడుతుండటంతో నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.


ఉద్యోగుల పనివేళలపై ప్రైవేటు కంపెనీల అధినేతల కామెంట్స్ కాక రేపుతున్నాయి. ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమ్మురేపాయి. ఆయన వ్యాఖ్యలతో ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ విభేదించగా, ఇప్పుడు ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ వారానికి 90 గంటలు పనిచేస్తే తనకు ఆనందమని చెప్పుకొచ్చారు.



ఆదివారాలు సెలవు తీసుకోకుండా పనిచేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపాలని సూచించారు ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్.  అంతేకాకుండా ఆయనీ సందర్భంగా ఉద్యోగుల భార్యల ప్రస్తావన తీసుకురావడం నెట్టింట వైరల్ అవుతోంది. 'ఎంత సేపు ఇంట్లో భార్యలను చూస్తుంటారు. వారానికి 90 గంటలు పనిచేయండి. అవసరమైతే ఆదివారాలు పనిచేయాలి. నేను ఆదివారం పనిచేస్తున్నా, మీరు పనిచేయాలని కోరుకుంటున్నా, మీతో ఆదివారాలు పనిచేయించగలిగితే నాకు సంతోషం, సంతృప్తి అంటూ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు.


దేశంలో ప్రైవేటు కంపెనీలు, ముఖ్యంగా ఐటీ రంగంలో వారానికి ఐదు రోజులే పనిచేస్తున్నారు. ఈ పద్ధతిని ప్రభుత్వ రంగంలోనూ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రైవేటు కంపెనీల అధినేతలు మాత్రం భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఉద్యోగులు ఎంత ఎక్కువ పనిచేస్తే అంత ఉత్పదకత ఉంటుందని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. వారానికి 70 రోజులు పని ప్రతిపాదనపై నారాయణమూర్తితో చాలా మంది విభేదించారు. ఇప్పుడు అంతకుమించి అన్నట్లు ఎల్ అండ్ టీ చైర్మన్ ఏకంగా సెలవు అన్నదే లేకుండా ఉద్యోగులు పనిచేయాలని పిలుపునివ్వడంపై వాడివేడి చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: