సింహాలకి ఖైదీలను ఆహారంగా పెట్టిన అసద్..? అరాచకాలు మామూలుగా లేవు గా?
దేశం విడిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al-Assad) పాలనలో కొనసాగిన పైశాచిక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.ప్రభుత్వ వ్యతిరేకులకు ప్రత్యక్ష నరకం చూపించేందుకు అసద్.. సైద్నాయ మిలటరీ జైలును ఏర్పాటు చేయగా.. మేమేం తక్కువ కాదన్నట్లు ఆయన నియంత పాలనలో అధికారులు కూడా వికృత చర్యలకు పాల్పడిన ఘటనలు బయటపడుతున్నాయి. అసద్ ఇంటెలిజెన్స్ విభాగంలోని కీలక అధికారి ప్రవర్తనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
అసద్ టైగర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్‌లో కీలక అధికారి తలాల్ దక్కాక్ (Talal Dakkak). అతడు ఖైదీలను తీసుకెళ్లి తన పెంపుడు సింహానికి ఆహారంగా వేసేవాడట. తనకు ఎదురు తిరిగిన వారందరికీ ఇదే శిక్ష. తాజాగా తిరుగుబాటు దారులు సిరియాను హస్తగతం చేసుకున్న నేపథ్యంలో దక్కాక్‌ను సిరియా పశ్చిమ ప్రాంతంలోని హమా పట్టణంలో బహిరంగంగా ఉరితీసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
దాదాపు 1500 మంది దక్కాక్ అధీనంలో పని చేసేవారు. వీరిని అడ్డుపెట్టుకొని, అసద్ అండదండలతో దక్కాక్ కీలకంగా ఎదిగాడు. సొంతంగా నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తన అధికారాన్ని ఉపయోగించి 2005లో 'జూ' నుంచి ఓ సింహాన్ని తీసుకొచ్చాడు. తనకు ఎదురుతిరిగిన వాళ్లను ఆ సింహానికి ఆహారంగా వేసేవాడు. దక్కాక్ సాగించిన అరాచక కార్యకలాపాలు అన్నీ ఇన్నీ కాదు. బలవంతపు వసూళ్లు, హత్యలు, కిడ్నాప్‌లు, అవయవ అక్రమ రవాణా లాంటి వికృత చర్యలకు పాల్పడ్డాడు. ఈ నరరూప రాక్షసుడు అంతమైనట్లు తెలుసుకున్న 'హమా' నగరవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌తో సహా కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ.. తిరుగుబాటు గ్రూపుల మధ్య సఖ్యతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పిడిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వారిని ఏకతాటిమీదకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిరియా రెబల్ నాయకుడు జులానీ ప్రయత్నాలు ఎంతమేర సఫలమవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు, పోలీసులు, సైనికుల స్థానంలో గస్తీ విధులను ప్రస్తుతం తిరుగుబాటుదారులే నిర్వర్తిస్తున్నారు. తాము ఎవరికీ హాని చేయబోమంటూ సాధారణ ప్రజలకు హామీ ఇస్తున్నారు. అయితే, ఇస్లామిక్ చట్టం ప్రకారం నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంతసులభం కాదు.