ప్రగతి భవన్.. ప్రజాభవన్‌.. భట్టి భవన్‌?

Chakravarthi Kalyan
ప్రగతి భవన్ హైదరాబాద్ బేగంపేటలో ఉండే సువిశాల భవంతి.  మొన్నటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఆయన ఎక్కువ శాతం అధికారిక సమీక్షలు ఇక్కడి నుంచే నిర్వహించేవారు. ఇప్పుడు  ఈ భవనాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా సర్కారు కేటాయించింది.


నిన్నటి వరకు కేసీఆర్ భవనంగా ఉన్న ప్రగతి భవన్ నేడు భట్టి విక్రమార్క నిలయంగా మారిపోయింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.  రేవంత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రగతి భవన్ ను జ్యోతి బా ఫులే  ప్రజా భవన్ గా పేరు మార్చారు.  కేసీఆర్ ప్రగతి భవన్ గడీలా మార్చుకున్నారని.. సామాన్యులకు అందులో ప్రవేశం లేదని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే ప్రజా భవన్ గా మారుస్తామంటూ హామీ ఇచ్చారు. అందులో సామాన్యులకు ఆహ్వానం పలికి  ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు.


ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన కంచెను తొలగించింది రేవంత్ సర్కారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే ఉన్నట్లుండి ప్రజా దర్బార్ పేరును ప్రజా వాణిగా మార్చారు. ఆ కార్యాక్రమాన్ని కూడా వారం రోజుల నుంచి రెండు రోజులకే కుదించారు. ఇక మీదట కేవలం మంగళవారం, శుక్రవారం నిర్వహించనున్నారని ప్రకటించారు.


ఇప్పుడు భట్టి విక్రమార్కకు ఈ భవనం కేటాయించడంతో మళ్లీ చర్చ మొదలైంది. వారంలో రెండు రోజులు స్వీకరించే వినతులను డిప్యూటీ సీఎం హోదాలో భట్టి తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ నిర్ణయంపై సోషల్  మీడియా వేదికగా పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజా భవన్ రెండు రోజుల మురిపంగా మారిందని.. ప్రగతి భవన్ కాస్తా ప్రజా భవన్ భవన్ ఆ తర్వాత భట్టి భవన్ గా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: