ఆ సెంటిమెంట్.. తెలంగాణ కాంగ్రెస్ను గెలిపిస్తుందా?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను పక్కన పెట్టి చాలామంది పోరాడారు. జేఏసీలు ఏర్పడి ఆయా జిల్లాల్లో, పట్టణాల్లో క్రియాశీలకంగా పనిచేసిన వారు ఆర్థికంగా కూడా కొంత నష్టపోయారు. కొంతమంది ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వాళ్లంతా కోర్టుల చుట్టూనే తిరుగుతు ఉన్నారు. ఉద్యమకారుల్లో కొంతమందికి కేసీఆర్ అవకాశం కల్పించినా.. చాలామందిలో అసంతృప్తి అలానే కొనసాగుతుంది. త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదని వారు ఇప్పటికీ వాపోతున్నారు.
అందుకే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు నెలవారీ రూ.25 వేల పింఛన్ ఇస్తామని చెప్పింది. దీంతో పాటు ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామని.. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో పాటుగా వాళ్లకు 250గజాల ఇళ్ల స్థలం కేటాయిస్తామని చెప్పడం వారికి ఊరట కలిగించే అంశం. అయితే కాంగ్రెస్ తెలంగాణ ఆలస్యంగా ఇవ్వడంతోనే ఆత్మబలిదానాలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వంగా కేసీఆర్ పై విమర్శ ఉంది. దీనిని కాంగ్రెస్ అస్త్రంగా మలచుకొని ఉద్యమకారులపై హామీల వర్షం కురిపించింది. చూద్దాం ఇది ఎంతమేర ఫలితం చూపిస్తోందో..?