బెయిల్ ఎఫెక్ట్: ఇక బాబు కడిగిన ముత్యమేనా?
ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసు నుంచి కూడా బయటపడినట్లే కనిపిస్తోంది. అంతకు మందు మంజూరు చేసిన షరతులతో కూడిన బెయిల్ ని రద్దు చేసి పూర్తి బెయిల్ ని ఏపీ హైకోర్టు ఇచ్చింది. దీంతో చంద్రబాబు యథావిధిగా తన రాజకీయ కార్యకలపాలు కొనసాగించవచ్చు. ఆయన కార్యచరణ పై కానీ, కదలికలు, ప్రసంగాలపై ఎటువంటి ఆంక్షలు లేవు. మధ్యంతర బెయిల్ నే ఓ పండుగ వాతావరణంలోజరుపుకున్న టీడీపీ శ్రేణులు హైకోర్టు తాజా నిర్ణయంతో మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు.
బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దానిని ఎల్లో మీడియా హైలెట్ చేసి ప్రచురించింది. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చంద్రబాబు ఏ తప్పు చేయలేదు. ఆయన కడిగిన ముత్యమే అనే అర్థానిచ్చేలా ఉన్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నిధులు మళ్లించారు అనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలను ఏపీ సీఐడీ సమర్పించలేకపోయిందని హైకోర్టు తేల్చి చెప్పింది.
నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమికంగా కనిపించడం లేదు. రికార్డులను పరిశీలిస్తే.. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత ఆయన్ను నిందితుడిగా చేర్చినట్లు స్పష్టమవుతుంది. అరెస్టు చేయడానికి మాత్రమే నమోదు చేసినట్లు తేటతెల్లమవుతుంది. అక్రమ లావాదేవీల్లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు సీఐడీ వాదిస్తోంది. ఈ వాదన బలపరిచేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. సహ నిందితులు, సాక్షులను ఆయన పరోక్షంగా ప్రభావితం చేశారన్న వాదలనకు సాక్ష్యాలు లేవు. 73ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి బెయిల్ ఇస్తున్నాం అని హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పకనే చెప్పింది.