అధికారులతో పార్టీ కార్యక్రమాలా.. ఇదేంటి జగన్?
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ఆ దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న వ్యూహాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ కార్యక్రమం ప్రభుత్వానిదా లేక పార్టీదా అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జగన్ మళ్లీ ఎందుకు సీఎంగా ఉండాలో తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ సిబ్బంది, అధికార పార్టీ శ్రేణులు సంయుక్తంగా కలిసి నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు, పుర, నగర పాలక సంస్థలు పరిధిలో కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలను అధికారుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. ప్రజలకు, ప్రభుత్వానికి వారే వారధులు, ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే సరి చేయాల్సింది.. పాలకుల దృష్టికి తీసుకు వెళ్లాల్సింది అధికారులే.
కానీ మళ్లీ జగనే రావాలి అనేది పార్టీ కార్యక్రమం. నన్నే మళ్లీ గెలిపించండి అని ఓ పార్టీ నాయకుడిగా జగన్ ప్రజలను కోర వచ్చు. కానీ ఈ మాట అధికారులు చెప్ప కూడదు. ఎందుకంటే వాళ్లు ప్రజా సేవకులు తప్ప పార్టీ కార్యకర్తలు కాదు. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంది. రాజకీయ అవసరాలకు ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించు కోవడం సరైన పద్ధతి కాదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.