ప్రశాంత్ కిషోర్ కామెంట్స్.. జగన్‌కు పెద్ద దెబ్బా?
సంపద సృష్టించక పోతే.. డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంచుతారని వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. సంపద సృష్టించే వాతావరణాన్ని సమాజంలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సంపద సృష్టికి ప్రభుత్వాలే సహకరించకపోతే పంచడానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందని.. అపరిమితంగా అప్పులు చేసే పరిస్థితికి దారి తీస్తుంది. సంపద సృష్టిస్తేనే దానిని పంచగలం అని ఆయన వ్యాఖ్యానించారు. అవతార్ లైవ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని పరిస్థితుల ప్రస్తావనకు రాగా ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే చంద్రబాబు గద్దె దిగిపోయేనాటికి ఏపీ సంపాదన 8లక్షల కోట్ల రూపాయాలు. ప్రస్తుత ఆదాయం రూ.11.50లక్షల కోట్లు. అంటే దాదాపు రూ. 3.5లక్షల కోట్లు సంపద పెరిగిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. జీఎస్టీ వసూళ్లు, ఆర్థిక వృద్ధి తదితర విషయాన్నింటిలోనూ టీడీపీ హయాంలో కన్నా మెరుగ్గా ఉన్నామని వారు పేర్కొంటున్నారు.
ఇదే సందర్భంలో నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, ఆసుపత్రుల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు చేపట్టామని.. ఇందులో కేంద్రం వాటా 60శాతం ఉన్నా మిగిలిన 40శాతం మన వాటానే. రాష్ట్రంలో సంపద సృష్టి లేకుండా ఎలా ఖర్చు పెడుతున్నామని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లు సంపద సృష్టిస్తే వాటిని పంచవచ్చు అని.. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారని సంపద పెంచుతూ వాటిని పంచుతున్నారని వారు కౌంటర్ ఇస్తున్నారు.