చెవిలో చిన్న‌మాట‌: జ‌గ‌న్ ట్రాప్‌లో ఆర్కే.. చంద్ర‌బాబుపై యాంటీ రాత‌లు!

R Bhanu


ద‌మ్మున్న ఛానెల్‌.. ద‌మ్మున్న మీడియా అంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ``ఔను! నిజ‌మే. మ‌న శ‌త్రువుల గుట్టుమ‌ట్లు వెలికితీయ‌డంలోను, మ‌న గ‌ట్టుమ‌ట్లు క‌ప్పెట్టి కాపాడ‌డంలోనూ ద‌మ్మున్న మీడియానే!!`` అని మ‌న‌సులోనే మేలిమి సంతోషం వ్య‌క్తం చేసేవారు. బాబు అధికారంలో ఉండ‌గా.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని, సీఎంగా బాబు తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆకాశానికి ఎత్తేసి, ప్ర‌తిప‌క్షాన్ని బ‌ఫూన్ చేసిన ఎల్లో మీడియాలోని కీల‌క‌మైన ద‌మ్మున్న ఛానెల్‌.. ఎప్పుడూ.. బాబు క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేసింది.. ఇప్ప‌టికీ ప‌నిచేస్తోంది. అయితే, అనూహ్యంగా ద‌మ్మున్న మీడియా బాబు ప‌రివారాన్ని అడ్డంగా ఇరికించేసి.. చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు ప‌ట్టించేసింది!  ``ఔను వాళ్లు త‌ప్పులు చేశారు!`` అని మాజీ మంత్రుల‌ను ఉద్దేశించి రాత‌లు కుమ్మ‌రించింది. 


నిజానికి ఈ రాత‌లు వేరే వేరే ప‌త్రిక‌ల్లో వ‌చ్చి ఉంటే.. చంద్ర‌బాబుకు అంత టెన్ష‌న్ ఉండేది కాదు. కానీ, త‌న ప‌క్షాన నిలిచి, త‌న‌ను శ‌త‌స‌హస్ర క‌లాల‌తో కాపాడుతున్న ద‌మ్మున్న మీడియానే ఇలా రాసేస‌రికి చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు ప‌ట్టేశాయ‌ని టీడీపీలోనే చెవిలో చిన్న‌మాట‌గా చెప్పుకొంటున్నారు. వారం వారం త‌న రాత‌ల‌తో ప్ర‌జ‌ల‌కు `రాజ‌కీయ రంగుల‌ విజ్ఞానం` పంచే ద‌మ్మున్న మీడియా అధినేత తాజాగా రాసిన `ఎల్లో ప‌లుకు`లో.. మంచికో.. చెడుకో.. జ‌గ‌న్‌ను భ్ర‌ష్టు ప‌ట్టించాల‌నే తొంద‌ర‌లో చంద్ర‌బాబును అడ్డంగా ఇరికించేశారు. దీంతో ఇది చ‌దివిన వారు అవాక్క‌వుతున్నారు. `ఆర్కేనే రాసేశారంటే.. దీనిలో వాస్త‌వం లేక‌పోలేదు! అయితే, ఆళ్లు దోచేశార‌న్న మాట‌. మామూలోళ్లు కార‌న్న‌మాట‌!` అనే వ్యాఖ్య‌లే చెవుల్లో చిన్న‌గా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 


ఇంత‌కీ ద‌మ్మున్న ఆర్కే ఏం రాశారంటే.. స‌హ‌జంగానే ఆయ‌న వారం వారం సీఎం జ‌గ‌న్‌పై దుమ్మెత్తి పోయ‌డంలో భాగంగా ఈ ఆదివారం కూడా క‌లానికి ప‌దును పెంచారు. కోర్టుల‌ను జ‌గ‌న్ లెక్క‌చేయ‌డం లేద‌ని, నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌ను తిరిగి నియ‌మించ‌డం లేద‌ని, పైగా కోర్టుల‌ను, న్యాయ‌మూర్తుల‌ను త‌ప్పుబ‌డుతున్నార‌ని రాసుకొచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డే ఆర్కేవారి క‌లం.. త‌డ‌బ‌డింది. నిబంధనలు, చట్టాలు, రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించినప్పుడు ఏ న్యాయస్థానం కూడా ఏ ప్రభుత్వానికీ అడ్డు రాదని అంటూ.. ``ఈఎస్‌ఐ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏడు వారాలు దాటినా హైకోర్టు బెయిల్‌ ఇవ్వకపోవడాన్ని గమనించాలి. అరెస్టయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కొడుకుదీ అదే పరిస్థితి. హత్యారోపణలపై అరెస్టయిన మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా జైల్లోనే ఉన్నారు కదా!`` అని చెప్పుకొచ్చారు. దీనికి కొన‌సాగింపుగా జగన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు హేతుబద్ధంగా లేనప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటున్నాయి అని ముక్తాయించారు. ఇదే.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు ప‌ట్టేలా చేసింది. 

 

ఆర్కే రాసిన దాని ప్ర‌కారం.. జ‌గ‌న్ విష‌యాన్ని ప‌క్కన పెడితే.. అచ్చెన్నాయుడు, కొల్లు, జేసీల‌కు బెయిల్ రాలేదు.. అంటే.. వారు ఆయా నేరాలు చేశార‌ని, జ‌నం సొమ్ము తిన్నార‌ని, బ‌స్సుల పేరుతో అక్ర‌మాలు చేస్తున్నార‌ని, హ‌త్య కేసులో కొల్లు పాత్ర ఉంద‌ని కోర్టులు న‌మ్ముతున్న‌ట్టే క‌దా!! అందుకే వారికి బెయిల్ రాలేద‌ని ఆర్కే వారు సూత్రీక‌రించారు. పైకి జ‌గ‌న్‌ను తిట్టిపోస్తున్న‌ట్టే ఉన్నా.. అంత‌ర్లీనంగా టీడీపీ నేత‌ల త‌ప్పుల‌ను కోర్టులు గుర్తించాయ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిమ‌రీ కొత్త‌ప‌లుకు ప‌ల‌క‌‌డంతో చంద్ర‌బాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయ‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. ఇదేవిష‌యాన్ని చెవిలో చిన్న‌గా చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఆర్కే క‌లం త‌డ‌బ‌డి ఇలా రాశారా?  అలా అయితే, ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రాసిన‌వ‌న్నీ నిజం కాద‌నుకోవాలి. లేదు.. ఆర్కే నిజ‌మే రాశారు.. అంటే.. టీడీపీ నేత‌లు అక్ర‌మాల‌కు ఒడిగ‌ట్టార‌ని చంద్ర‌బాబు ఒప్పుకోవాలి!! మొత్తానికి బాబును ఆర్కే బాగానే ఇరికించాడ‌న్న‌మాట‌!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: