చదువుకున్న వారినీ మోసం చేసిన జోస్యుడు.. చిలుకతో కలిసి జంప్!
బెంగళూరులోని భారతినగర్ ప్రాంతంలో ఈ వింతైన మోసం వెలుగుచూసింది. శ్రీ సర్కిల్ వద్ద రోడ్డు పక్కన చిలుక జోస్యం (Gili Shastra) చెబుతూ కూర్చునే శేఖర్ అనే వ్యక్తిని ఐటీ అధికారి కలిశారు. తనకు మంచి చోటుకు బదిలీ (Transfer) కావాలని, జీవితం బాగుండాలని ఆ అధికారి కోరారు. మొదట పూజల పేరుతో శేఖర్ ఆ అధికారి నుంచి ₹50,000 వసూలు చేశాడు. ఆ తర్వాత మాటలతో నమ్మించి, నీకు పెద్ద స్థాయిలో బడ్తీలు, బదిలీలు రావాలంటే ఇంట్లో ఉన్న బంగారంతో ‘మహా పూజ’ చేయాలని నమ్మబలికాడు.
జోస్యుడి మాయమాటలు నమ్మిన ఆ అధికారి, తన ఇంట్లో ఉన్న నగలను తెచ్చి శేఖర్‌కు అప్పగించారు. సుమారు 194 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ ₹31 - ₹35 లక్షలు) మరియు 1.3 కేజీల వెండి వస్తువులను ఆ కేటుగాడి చేతిలో పెట్టారు.పూజ ముగిశాక ఒక రోజులో నగలు ఇచ్చేస్తానని చెప్పిన శేఖర్, ఆ తర్వాత ఫోన్ చేస్తే వారం రోజులు తిప్పించుకున్నాడు. చివరకు ఆ అధికారి అక్కడికి వెళ్లి చూసేసరికి.. అటు జోస్యుడు శేఖర్ లేడు, ఇటు భవిష్యత్తు చెప్పే చిలుక లేదు. ఇద్దరూ నగలతో సహా జంప్ అయ్యారు.
బాధితుడు వెంటనే భారతినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు ఆ కేటుగాడి కోసం వేట మొదలుపెట్టారు.సామాన్యులను, చదువుకున్న వారిని ఇలాంటి మూఢనమ్మకాలు ఎలా దెబ్బతీస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.