భార్యకు పురిటినొప్పులు.. తోపుడు బండిపై ఆసుపత్రికెళ్తే?
అంతేకాదు ఇటీవల కాలంలో ఆసుపత్రుల్లో సామాన్య ప్రజలకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించ లేని దుస్థితి ఏర్పడింది. దీంతో తమ ప్రియమైన వారు ఒకవేళ ప్రాణాలు కోల్పోతే భుజాన వేసుకుని వెళ్లే దుస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. గర్భిణి అయిన తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు భర్త. అంబులెన్సు ఎంతకీ రాకపోవడంతో తోపుడు బండిపై స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు. కనీసం అక్కడైనా వైద్యులు ఉంటారని కాస్తోకూస్తో వైద్యం చేస్తారని అనుకున్నాడు.
కానీ స్థానిక ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అతనికి ఊహించని షాక్ తగిలింది. స్థానిక ఆస్పత్రిలో వైద్యులు లేరు కనీసం నర్సులు కూడా కనిపించకపోవడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో వెలుగుచూసింది. రానేహ్ ప్రాంతానికి చెందిన కైలాష్ అనే వ్యక్తి భార్య కాజల్ నిండు గర్భిణీ. ఇటీవల పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్ కు కాల్ చేయగా ఎవరు రాలేదు. దీంతో చేసేదేమీ లేక తోపుడు బండిపై ఆమెను పడుకోబెట్టి కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకెళ్లాడు. వైద్యులు నర్సులు ఎవరు అందుబాటులో లేరు చివరికి అతికష్టం మీద ఆంబులెన్స్ రాగా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఘటనపై మెడికల్ ఆఫీసర్ సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు.