చోరీకి వెళ్ళాడు.. కానీ వచ్చిన పని మానేసి?

praveen
సినిమాల్లో చూస్తూ ఉంటాం.. చోరీలకు వచ్చిన దొంగలు పక్కాగా ప్లాన్ ప్రకారం ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటారు. అందరూ పడుకున్న తర్వాత తమ పని కానిచ్చేస్తూ ఉంటారు.. అయితే ఇలా చోరీలకు వచ్చిన దొంగలకు ఆకలేస్తుంది అంటే ఇక దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే కిచెన్లోకి వెళ్ళి ఏదో ఒకటి వండుకొని తినడం.. హాయిగా దొంగతనం చేసుకొని వెళ్లిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే సినిమాల్లో ఇవి చూసినప్పుడు తెగ నవ్వు కుంటూ ఉంటారు ప్రేక్షకులు. అదేసమయంలో ఇలాంటివి సినిమాల్లో మాత్రమే సాధ్యం అవుతుంది అని చెప్పాలి. కానీ నిజజీవితంలో కూడా ఇలాగే చేయాలి అనుకుంటే సీన్ కాస్త రివర్స్ అయి దొంగలు కటకటాల వెనక్కి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

 కానీ ఇటీవలి కాలంలో ఎంతో మంది దొంగలు ఇలా ఇళ్లల్లోకి చోరీలకు వెళ్లి అక్కడే తమకు కావాల్సినవి వండుకుని తిని హాయిగా దొంగతనాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఒక దొంగ అలాంటిదే చేయాలనుకున్నాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అస్సాంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇంట్లోకి చోరీ చేసేందుకు వెళ్లాడు సదరు దొంగ. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇక తనకు తిరుగు లేదు అని అనుకున్నాడు. అంతలో అతనికి ఎంత ఆకలేసిందో ఏమో పాపం వెంటనే కిచెన్ లోకి వెళ్లి కిచిడీ వండటం  మొదలుపెట్టాడు. మసాలాలు ఎక్కువగా వేసినట్లున్నాడు. ఆ వాసన పక్కింటి వరకు వెళ్ళింది. ఇంకేముందిఇంత అర్ధరాత్రి ఎవరు వంట చేస్తున్నారా అని స్థానికులు ఇంట్లోకి గమనించడం మొదలు పెట్టారు.

 ఇక అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు పక్కింటి వాళ్లు. దీంతో హుటాహుటిన పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత పాపం కిచిడీ చేసుకుంటున్న దొంగను పట్టుకుని స్టేషన్కు లాక్కెళ్లారు. ఆరోగ్యప్రయోజనాలు ఉన్నప్పటికీ చోరికి యత్నించిన సమయంలో కిచిడి వండటం మీ శ్రేయస్సుకు మంచిది కాదు అంటూ ఆ తర్వాత ఒక సరదా పోస్టు పెట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: