గంజాయి స్మగ్లింగ్‌: వైజాగ్‌ టు హైదరాబాద్‌!

N.Hari
హైదరాబాద్‌ను గంజాయి మత్తు వీడటం లేదు. ఎన్నిసార్లు ఎంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ భాగ్యనగరానికి ఇటు డ్రగ్స్‌, అటు గంజాయి తరలివస్తూనే ఉంది. గంజాయి మాఫియా పోలీసుల కళ్లుగప్పి స్మగ్లింగ్‌కు పాల్పడుతోంది. సినీ ఫక్కీలో వ్యూహ రచన చేస్తూ గంజాయిని గుట్టుగా తరలిస్తోంది. ముఖ్యంగా వైజాగ్‌ టు హైదరాబాద్‌కు ఎప్పటికప్పుడు కొంగొత్త పద్ధతులలో, వివిధ రూపాల్లో రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దానిని స్టూడెంట్స్‌కు, పబ్బుల్లో, క్లబ్బులలో గుట్టుగా విక్రయిస్తున్నారు. తాజాగా విశాఖపట్నం ఏజెన్సీ నుండి హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ముఠాను రాచకొండ, భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆరుగురు ముఠాగా ఏర్పడి విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుండి భువనగిరి రామన్నపేట మీదుగా హైదరాబాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుండి 294 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మొన్నటివరకు హైదరాబాద్‌లో డ్రగ్స్‌ అనే పేరు మారుమోగింది. అయితే ప్రభుత్వం ఆదేశాలతో దానిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో డ్రగ్స్‌ సరఫరాకు కొంతవరకు అడ్డుకట్ట పడినట్లుగా కనిపిస్తోంది. అయితే గంజాయి స్మగ్లింగ్‌ మాత్రం ఊపందుకుంది. న్యూయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కు పెద్దఎత్తున గంజాయి సరఫరా జరిగిందని సమాచారం. ఇక న్యూయర్‌ ముగిసిందో లేదో మరోసారి హైదరాబాద్‌పై గంజాయి ముఠాలు కన్నేశాయి. పోలీసులకు దొరక్కుండా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ట్రాన్స్‌పోర్టు వెహికల్‌, కారు డోర్లు, బెనేట్‌లో గంజాయిని ఉంచి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. చివరకు పోలీసుల ముందు కుదేలవుతున్నారు. కాగా, పోలీసులకు పట్టుబడుతున్న గంజాయి స్వల్పమేననీ, ఇంకా దొరక్కుండా స్మగ్లింగ్‌ అయిన గంజాయి చాలానే ఉంటుందని అంచనా.
తాజాగా రాచకొండ, భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేసిన ముఠా.. విశాఖ ఏజెన్సీలో కిలో గంజాయిని రూ.2 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.10 వేలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గంజాయిని సులువుగా అమ్మేందుకు రెండు కిలోల చొప్పున ప్యాక్‌ చేసి విక్రయ ముఠాలకు సరఫరా చేస్తున్నారని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. పట్టుబడిన నిందితుల నుండి మొత్తం రూ. 43 లక్షలు విలువజేసే 294 కిలోల గంజాయి, నగదు, కారు, ఓ ట్రాన్స్‌ పోర్టు వాహనం, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: