దారుణం ఆస్తి కోసం : భ‌ర్త‌ను భార్య ఏం చేసిందంటే..?

Paloji Vinay
రానురాను సమాజంలో బంధాలు, బంధుత్వాలకు చోటు లేకుండా పోతోంది. మ‌నుషుల కంటే ఆస్తులు, పైస‌లకు ఎక్కువ‌ ప్రాముఖ్య‌త పెరిగిపోతోంది. ఆస్తుల కోసం ర‌క్తం పంచుకుని పుట్టిన బిడ్డ‌ల‌ను.. జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రుల‌ను క‌డ‌తేర్చుతున్నారు. తాజాగా నాలుగు ఎక‌రాల భూమిని త‌నకు రాసివ్వాల‌ని ఓ వివాహిత త‌న భ‌ర్త‌ను హ‌త్య చేసింది. ఈ దారుణ సంఘ‌ట‌న దేవ‌ర‌కొండ మండ‌లం శేరిప‌ల్లిలో గురువారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు, మృతుడు బంధువుల వివ‌రాల మేర‌కు.. శేరిప‌ల్లి తాండాకు చెందిన ర‌మావ‌త్ మోతీలాల్ (45)- భార్య ల‌లిత‌తో క‌లిసి కూలి ప‌నులు చేసుకుంటూ బ‌తుకుతున్నారు.  వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.


 

 అయితే, వీరిద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌డంతో భార్య ల‌లిత త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఆరేళ్లుగా హైద‌రాబాద్ నివాసం ఉంటుండుడ‌గా.. మోతీలాల్ శేరిప‌ల్లి తాండాలోనే ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో కొంత కాలంగా మోతీలాల్ పేరు మీద ఉన్న నాలుగు ఎక‌రాల భూమిని త‌న పేరు మీద చేయాల‌ని భ‌ర్త‌తో గొడ‌వ ప‌డుతుండేది. ఈ క్ర‌మంలో బుధ‌వారం బంధువుల ఇంట్లో శుభ‌కార్యం ఉండ‌డంతో ల‌లిత హైద‌రాబాద్ నుంచి శేరిప‌ల్లి తండాకు వ‌చ్చింది. త‌రువాత రాత్రి అద‌నుగా భావించిన ల‌లిత భ‌ర్త తాగే మ‌ధ్యంలో పురుగుల మందు క‌లిపింది. దీంతో మోతీలాల్ ఆ మందు తాగ‌డంతో చ‌నిపోయాడు. తెల్లారి గురువారం రోజు ల‌లిత త‌న భ‌ర్త  అతిగా మద్యం తాగి మృతి చెందాడ‌ని బోరున విల‌పించింది.


 దీంతో బంధువులకు అనుమానం రావ‌డంతో నిల‌దీశారు. దీంతో నిజం ఒప్పుకున్న ల‌లిత పురుగుల మందు క‌లిపి హ‌త్య చేసిన‌ట్టు అంగీక‌రించింది. అయితే, హైద‌రాబాద్‌లో అక్ర‌మ సంబంధం పెట్టుకోవ‌డం కార‌ణంగానే ల‌లిత త‌న భ‌ర్త‌ను చంపేసింద‌ని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మృతుడు సోద‌రుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు  చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. హ‌త్య చేసిన ల‌లిత‌ను పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకున్న‌ట్టు సీఐ బీస‌న్న పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: