పండుగ పూట విషాదం..కల్తీ మద్యం తాగి 8 మంది మృత్యువాత
నౌతాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దక్షిణ తెల్హువా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీపావళికి ముందు మద్యం తాగి 8 మంది చనిపోవడంతో కలకలం రేపింది. బుధవారం సాయంత్రం స్థానికులు మద్యం సేవించారు. మద్యం తాగిన కొద్దిసేపటికే వారి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో వారిని హుటాహుటిన సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత ఒకరి వెంట మరొకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
విషపూరిత మద్యం తాగడంతో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కల్తీ మద్యం లేదా మరేదైనా పదార్థాలు తాగడం ద్వారా వారంతా చనిపోయినట్టు తెలిపారు. ఈ వ్యక్తులందరూ మద్యం సేవించారని మృతుల బంధువులు చెప్పారు. ఘటనా స్థలం నుంచి మద్యం సీసా, హీమోపతిక్ మందు సీసా కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో పంచాయతీ సమితి సభ్యుడు కూడా ఉండడం గమనార్హం.
అంతకుముందే గోపాల్‌గంజ్‌లోని మహ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మద్‌పూర్ గ్రామం, బుచెయా, లోహజిరాలో ఆరుగురు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తరువాత వెంటనే కంటి చూపు కూడ పోయినదని చెప్పారు. కల్తీ మద్యమే దీనికి కారణం అని వెల్లడి అయింది. వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు వెల్లడించారు. మొత్తం కల్తీ మద్యం సేవించి 8 మంది మృతి చెందారు.