లోయలో ప‌డిన బ‌స్సు.. 32 మంది మృతి

N ANJANEYULU
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఓ కొండ ప్రాంతం నుంచి అదుపుత‌ప్పిన‌ బ‌స్సు ఒక్క‌సారిగా లోయ‌లోకి దూసుకెళ్లింది. ఈ సంఘ‌ట‌న‌లో 32 మంది ప్ర‌యాణికులు మృత్యువాత‌ప‌డ్డారు. కొంత మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. చాయ‌నాథ్ రారా మున్సిపాలిటీ ప‌రిధిలోకి రాగానే ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా బ‌స్సు టైర్ పంక్ష‌న్ అయింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 45 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.
ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా వ‌ల‌స కార్మికులు, విద్యార్థులు  మంగ‌ళ‌వారం నేపాల్ గంజ్ నుంచి ముగ్ జిల్లా గామ్‌గ‌ధికి బ‌య‌లుదేరారు. బ‌స్సు చాయానాథ్ ప‌ట్ట‌ణం దాట‌గానే టైర్ పంక్ష‌ర్ అయి అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డింది. దాదాపు 300 అడుగుల లోతుకు వెళ్లి దిగువ‌న ఉన్న పినాజ్యారి న‌దిలో ప‌డింది. చాలా ఎత్తు నుంచి బ‌స్సు ప‌డిపోవ‌డంతో తునాతున‌క‌లైంది. మృత‌దేహాలు చెల్లా చెదుర‌య్యాయి. కొంత‌మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. కొంత మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.
నేపాల్‌లో రోడ్డు ప్ర‌మాదాలు త‌రుచూ చోటు చేసుకుంటున్నాయి. అక్క‌డ ఉన్న గుంత‌ల రోడ్డు మూలంగానే ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని స‌మాచారం. అందుకు తోడు కొండ ప్రాంతాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో రోడ్డు క‌నెక్టివిటీ అనేది స‌రిగ్గా ఉండ‌దు. రోడ్ల‌న్ని చాలా చోట్ల రాళ్లు, ర‌ప్ప‌ల‌తో నిండి ఉంటాయి. దీనికి తోడు గుంత‌ల‌మ‌యమైన రోడ్లు ఉండ‌డంతో త‌రుచూ ప్ర‌మాదాలు చోటు చేసుకుంటాయ‌ని స‌మాచారం. అదేవిధంగా కొండ‌పై మ‌లుపుల వ‌ద్ద వాహ‌నాలు ఎక్కువ వేగంతో వెళ్లినా ప్ర‌మాదాలు సంభ‌విస్తుంటాయి. నేపాల్‌లో ఫిట్‌నెస్ లేని వాహ‌నాలు సైతం ఎక్కువ‌గా తిరుగుతుంటాయి. ఈ కార‌ణాల వ‌ల్ల‌నే అక్క‌డ ఎప్పుడు ఏదో ఒక ప్ర‌మాదం చోటు చేసుకుంటుంది. దీనికి తోడు అతివేగంగా బ‌స్సు వెళ్ల‌డం.. అక‌స్మాత్తుగా టైర్ పంక్ష‌ర్ కావ‌డంతో బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లోకి దూసుకెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో ఇంకొంత మ‌ర‌ణించే అవ‌కాశం ఉంద‌ని అక్క‌డి పోలీస్ సిబ్బంది పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: