సూపులో ఎలుక.. రెస్టారెంట్ షేర్లు పాతాళానికి?

frame సూపులో ఎలుక.. రెస్టారెంట్ షేర్లు పాతాళానికి?

praveen
సాధారణంగా కంపెనీలు సరిగా వ్యాపారం చేయకపోయినా, లేదా పాలన సరిగ్గా లేకపోయినా వాటి షేర్ల ధర పడిపోతుంది. ఒక్కోసారి ఏదైనా రంగం మొత్తం సమస్యల్లో ఉంటే కూడా ఆ రంగంలోని కంపెనీల షేర్లు నష్టపోతాయి. కానీ జపాన్‌లో ఒక వింత సంఘటన జరిగింది. సూప్‌లో ఎలుక పడటంతో ఒక రెస్టారెంట్ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి.
సుకియా అనే జపనీస్ రెస్టారెంట్ చైన్‌ను జెన్షో హోల్డింగ్స్ అనే సంస్థ నడుపుతోంది. వీరికి జపాన్ అంతటా 2,000కు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. జనవరి 21న, టొట్టోరిలోని సుకియా బ్రాంచ్‌కు భోజనానికి వెళ్లిన ఒక కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. సూప్ తింటుండగా, అందులో చచ్చిన ఎలుక కనిపించింది. వెంటనే అతను కంప్లైంట్ చేశాడు.
ఆ కస్టమర్ సూప్‌లో ఎలుకను చూసి షాక్ అవ్వడమే కాదు, వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ విషయం వైరల్ అయిపోయింది. నెటిజన్లు సుకియా రెస్టారెంట్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. దీని ప్రభావం కంపెనీ షేర్లపై వెంటనే కనిపించింది.
ఆశ్చర్యకరంగా, సుకియా ఈ విషయాన్ని దాదాపు రెండు నెలల తర్వాత, మార్చి 22న ప్రజలకు తెలిపింది. కల్తీ జరిగినందుకు కంపెనీ క్షమాపణలు చెప్పింది. ఆలస్యంగా చెప్పినందుకు విచారం వ్యక్తం చేసింది. ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ప్రకటించింది.
ఈ వార్తతో పెట్టుబడిదారులు సుకియా రెస్టారెంట్ల పరిశుభ్రత గురించి ఆందోళన చెందారు. దీంతో జెన్షో హోల్డింగ్స్ షేర్లు మార్చి 24న ట్రేడింగ్ సమయంలో 7.1% పడిపోయాయి. రోజు ముగిసే సమయానికి 4.72% నష్టంతో క్లోజ్ అయ్యాయి.
గత ఏడాదిగా మంచి లాభాల్లో ఉన్న జెన్షో కంపెనీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ. బలమైన వ్యాపారం, ధరలు పెంచడం వంటి కారణాలతో గత 12 నెలల్లో కంపెనీ షేర్లు 25% పెరిగాయి.
కంపెనీ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందనే దానిపైనే జెన్షో షేర్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వినియోగదారుల నమ్మకం, అమ్మకాలు తిరిగి పుంజుకుంటేనే షేర్లు మళ్లీ గాడిలో పడతాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: