ఉద్యోగ‌మా నీవెక్క‌డ : దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం..?

Paloji Vinay
దేశంలో నిరుద్యోగ రేటు రోజురోజుకు పెరుగుతూ.. నాలుగు నెల‌ల గ‌రిష్టానికి చేరింది. 2021 న‌వంబ‌ర్ లో 7.0 శాతంగ ఉన్న నిరుద్యోగ రేటు డిసెంబ‌ర్‌లో 7.9 శాతానికి పెరిగింది. ఆగ‌స్టులో గ‌రిష్టంగా 8.3 శాతంగా న‌మోద‌యింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో విధిస్తున్న ఆంక్ష‌లతో ఆర్థిక కార్య‌క‌లాపాలు నెమ్మ‌దించ‌డంతో నిరుద్యోగం పెరుగుతుంద‌ని సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మి (సీఎంఐఈ) నివేదిక వెల్ల‌డించింది. డిసెంబ‌ర్‌లో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 9.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 7.3 శాతం మేర నిరుద్యోగం న‌మోద‌యిన‌ట్టు సీఎంఐఈ తాజాగా విడుదల చేసిన గ‌ణంకాలు పేర్కొన్నాయి. ఒమిక్రాన్ పెరిగితే గ‌త త్రైమాసికంలో పుంజుకున్న ఆర్థిక వ్య‌వ‌స్థ తిరుగు ప‌య‌నం అవుతుంద‌ని ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

    డిసెంబ‌ర్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 5.6 శాతం, తెలంగాణ‌లో 2.2 శాతం నిరుద్యోగిత రేటు న‌మోద‌యింది. అత్య‌ధికంగా హ‌ర్యాణ‌లో 34.1 శాతం నిరుద్యోగ రేటు న‌మోద‌యింది. న‌వంబ‌ర్‌లో ప‌ది నెల‌ల గ‌రిష్టానికి చేరిన త‌యారి కార్య‌క‌లాపాలు డిసెంబ‌ర్‌లో నెమ్మదించాయి. ఇక ఎప్ప‌టిలాగే ముడి ప‌దార్థాల ఖ‌ర్చులు డిసెంబ‌ర్‌లో పెరిగాయి. అదే స‌మ‌యంలో ఆర్డ‌ర్లు పెర‌గ‌డం కూడా విశేషం. దేశంలో నిరుద్యోగ రేటు 2021 సెప్టెంబ‌ర్ నుంచి క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంది. దేశ వ్యాప్తంగా నిరుద్యోగ స‌మ‌స్య తీవ్ర‌మ‌వుతుండ‌డంతో భ‌విష్య‌త్తులో తీవ్ర ప‌రిణామాలు ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.

        క‌రోనా ప్ర‌భావంతో ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా నిరుద్యోగ రేటు క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంది. ఒక్క ఆగ‌స్టులోనే 16 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని సీఎంఈఐ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. గ‌త కొన్ని నెల‌లు భార‌త్ క‌ఠిన ఉపాధి కొర‌త‌ను ఎదుర్కొంటోంది. కొవిడ్ వ్యాప్తి త‌రువాత ప‌రిస్థితి మ‌రింత దిగజారిపోయింది. ఆర్థిక ప‌రిస్థితి సాధార‌ణ స్థితికి చేరుకున్న‌ప్ప‌టికీ జాబ్‌ల క‌ప్ప‌న మాత్రం పెర‌గ‌డం లేదు. దేశంలో ఇప్ప‌టికే 8 రాష్ట్రాలు రెండెంకెల నిరుద్యోగ రేటును తాకింది. క‌రోనా క‌రాణంగా క్ర‌మంగా ఉద్యోగాలు ఊడుతున్నాయి. వ‌రుస లాక్‌డౌన్‌ల కార‌ణంగా మెజారిటీ  రంగాల్లో కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. త‌రువాత స‌డ‌లింపులు ఇస్తున్న‌ప్ప‌టికీ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌ను త‌గ్గిస్తోంది. ఫ‌లితంగా నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: