బంగారు వ్యాపారులకు హెచ్‌ యూఐడీ టెన్షన్‌!

N.Hari
బంగారు నగలు కొనే ప్రతి ఒక్కరికీ పరిచయం ఉన్న పదం హాల్ మార్క్ . ఇది బంగారం స్వచ్ఛతను కొలిచేందుకు ఉపయోగపడే అధికారిక ముద్ర. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నగల వ్యాపారులకు హాల్ మార్క్‌ను ఇస్తుంది. నాసిరకం బంగారు నగలు కొనుగోలు చేసి వినియోగదారులు మోసపోకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. ఆభరణాలపై నాలుగు ప్రధాన గుర్తులు ఉంటాయి. త్రిభుజం గుర్తు అనేది బీఐఎస్ మార్క్‌ను సూచిస్తుంది. స్వచ్ఛతను 916 నెంబర్‌తో సూచిస్తారు. తర్వాత ఉండేది ఆభరణాల వ్యాపారి గుర్తు. ఇక మిగిలింది గుర్తింపు పొందిన ఆస్సాయింగ్ సెంటర్ మార్క్. అది ఆభరణం తయారు చేసిన సంవత్సరం. వీటిలో ఏ ఒక్క ముద్ర లేకపోయినా అనుమానించాల్సిందే. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలపై ఈ ముద్రలు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది.
కొత్త హాల్‌ మార్క్ నిబంధన జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో మొదటి విడతగా 256 జిల్లాల్లో అమలవుతోంది. అయితే నగలకు హాల్‌ మార్క్‌ ఇవ్వడంలో ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆభరణాల వ్యాపారి గుర్తు, ఆస్సాయింగ్ సెంటర్ ముద్రకు బదులు కొత్త నిబంధనల్లో భాగంగా హెచ్ యూఐడీ నెంబర్‌ను ముద్రించనున్నారు. అయితే ముద్ర వేసే సందర్భంలో ఇచ్చే హెచ్ యూఐడీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ట్రాకింగ్ చేసేందుకు ఉపయోగిస్తారనే అనుమానాలు వ్యాపారుల్లో ఉన్నాయి. తమ వినియోగదారుల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా లేమని వ్యాపారులు అంటున్నారు.
కాగా యేటా పది నుంచి 12 కోట్ల బంగారు నగలు తయారవుతున్నాయి. ఇప్పటికే హాల్ మార్క్ చేయాల్సినవి 6 నుంచి 7 కోట్ల వరకు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హాల్ మార్క్ వేసే సెంటర్లు సైతం తక్కువ సంఖ్యలో ఉన్నాయంటున్నారు.  ముద్ర వేసే సమయంలో నగలు దెబ్బతింటున్నాయని, భద్రత, హామీలో సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం కొత్త నిబంధనల ప్రకారం రెండు గ్రాములు దాటిన చిన్న కమ్మ నుంచి ప్రతి వస్తువుపైనా ముద్ర వేయడంలో ఆచరణాత్మకంగా సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. మొత్తంగా కొత్త హాల్‌ మార్క్‌ విధానం సమర్థిస్తున్న చిరు వ్యాపారులు.. హెచ్‌ యూఐడీని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ నిబంధనతో తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ యూఐడీ నంబర్‌పై తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: