అయ్యో.. ఇండియా నుంచి బిలియనీర్లు వెళ్లిపోతున్నారట..?

Chakravarthi Kalyan
ఒక దేశం అభివృద్ధి చెందాలంటే  పెట్టుబడులు కావాలి.. డబ్బు కావాలి.. ఆ డబ్బుతో పరిశ్రమలు వంటివి వస్తాయి. ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అందుకే కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు పెట్టుబడుల కోసం అర్రులు చాస్తుంటాయి. బాబో.. మా రాష్ట్రానికి రండి.. ఓ కంపెనీ పెట్టండి.. మీకు ఆ రాయితీలు  ఇస్తాం.. ఈ రాయితీలు ఇస్తాం.. అంటూ బతిమాలుకుంటుంటాయి. పెట్టుబడిదారుల వెనుక పడుతుంటాయి.

అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇండియాకు కొత్త పెట్టుబడిదారుల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు అసలు మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులే విదేశాలకు వలసలు వెళ్లిపోతున్నారట. ఇతర దేశాల్లో  పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లిపోతున్నారట. అంతే కాదు.. ఆయా దేశాల పౌరసత్వం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలా వెళ్లిపోయేవాళ్లు అమెరికా, బ్రిటన్‌, ఐరోపా, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్‌పై దేశాలపట్ల ఆసక్తి చూపుతున్నారట.

ఈ విషయాన్ని తాజాగా వెలువడిన గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం.. గత ఏడాదిలో విదేశాలకు వలస వెళ్లిన భారత మిలియనీర్ల సంఖ్య దాదాపు 5 వేల వరకూ ఉందట. అంటే.. దేశంలోని మొత్తం మిలియనీర్లలో 2 శాతం అన్నమాట. ఇక పెట్టుబడుల ద్వారా ఇతర దేశాల్లో పౌరసత్వం పొందేందుకు 1500 మంది మిలియనీర్లు ఆసక్తి చూపించారట. వారు గ్లోబల్‌ సిటిజన్‌షిప్‌, రెసిడెన్స్‌ అడ్వైజరీ సంస్థ హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ను ఈ మేరకు సమాచారం కోరారట. అంతేకాదు.. ఇలాంటి వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఏకంగా 63 శాతం పెరిగిందట.

ఇక పెట్టుబడుల ద్వారా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లో స్థిరపడాలనుకునే వారి కోసం ఆ దేశం గోల్డెన్‌ వీసా పథకాన్ని ప్రారంభించింది. దీన్ని ఇప్పటివరకు 254 మంది మిలియనీర్లు ఉపయోగించుకున్నారట. మోర్గాన్‌ స్టాన్లీ అనే అంతర్జాతీయ కంపెనీ చెబుతున్న లెక్కల ప్రకారం.. 2014 నుంచి ఇప్పటివరకు ఇండియా నుంచి విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడ్డ భారత బిలియనీర్లు సంఖ్య దాదాపు 23,000గా ఉండొచ్చట.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: