నల్గొండ సభతో కేసీఆర్ నిన్న బయటకు వచ్చారు. రేవంత్ సర్కారుపై మండిపడ్డారు. పనిలో పనిగా ప్రజలను కూడా విమర్శించారు. జనం ఏం భ్రమలో పడ్డారో ఏమో కానీ పాలిచ్చే బర్రెను కాదని.. దున్నపోతును తెచ్చుకున్నారని అన్నారు. అయితే.. ఈ మాటలను ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. కేసీఆర్ ప్రజా తీర్పును అవమానిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలిచ్చే బర్రె ఏదో...దున్నపోతు ఏదో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అందుకే బీఆర్ఎస్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు.
గత తొమ్మదిన్నర ఏళ్లు ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాడింది కాబట్టే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ నల్గొండ సభ నిర్వహించారని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్కడ తమ అవీనితి బయటపడుతుందో అనే భయంతోనే కేసీఆర్ డ్రామా ఆడారన్నారు. మాట తప్పను... మడమ తిప్పను అన్నాడు...కానీ జరిగిందేమిటని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.