రైతుబీమా తరహాలోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీతకార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి ఐదులక్షల రూపాయల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇప్పటి వరకు ఇస్తున్న పరిహారం బాధితులకు అందడంలో ఆలస్యమవుతోందన్న సీఎం కేసీఆర్.. రైతుబీమా తరహాలోనే కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపాందించాలని ఆర్థిక, ఎక్సైజ్ శాఖల మంత్రుల హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేసీఆర్ చెప్పారు.