టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ తీరుపై మండిపడ్డారు. సీఐడీని అడ్డుపెట్టుకుని టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐడి వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయిందని నారా లోకేశ్ విమర్శించారు. జగన్ రెడ్డి మూర్ఖత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధించడమే లక్ష్యంగా సిఐడి అధికారులు పనిచెయ్యడం దారుణమని నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త వెంగళరావు చేసిన తప్పేంటని నారా లోకేశ్ ప్రశ్నించారు. అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నారా లోకేశ్ నిలదీశారు.
ఎవరి ఆదేశాల మేరకు సిఐడి అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని నారా లోకేశ్ ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఉడత ఊపులకు భయపడే వారు ఎవ్వరూ టీడీపీలో లేరని పేర్కొన్నారు. అరెస్ట్ చేసి కొడితే ప్రశ్నించడం తగ్గుతుంది అని భ్రమపడకు జగన్ రెడ్డి.. అంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎంత తొక్కితే అంత లేస్తాం.. అన్ని లెక్కలు తేలుస్తాం అని నారా లోకేశ్ హెచ్చరించారు.