తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు కింద చేర్చడానికి అర్హత లేదని తేల్చి చెప్పింది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. కానీ.. ఈ డిమాండ్ అలాగే ఉండిపోయింది. అయితే.. అసలు జాతీయ హోదా వచ్చే అర్హతే కాళేశ్వరం ప్రాజెక్టుకు లేదని తాజాగా కేంద్రం తేల్చి చెప్పింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు ఈ సమాధానం ఇచ్చారు. లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.
2016, 2018లో తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు స్పష్టం చేశారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుందన్న కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు .. హై పవర్ కమిటీ అనుమతిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుందన్నారు.