ఏం జరుగుతుంది?:బోండా ఉమ వర్సెస్‌ వాసిరెడ్డి పద్మ?

Chakravarthi Kalyan
విజయవాడలో అత్యాచార బాధితురాలి పరామర్శలో జరిగిన గొడవ ఇప్పుడు టీడీపీ వర్సెస్‌ రాష్ట్ర మహిళా కమిషన్ వ్యవహారంగా మారింది. మొన్న బాధితురాలిని పరామర్శించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్‌ వాసిరెడ్డి పద్మ వెళ్లిన సమయంలోనే చంద్రబాబు, బోండా ఉమా వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలు వాసిరెడ్డి పద్మతో దురుసుగా ప్రవర్తించారని ఆమె చెబుతున్నారు. ఓ రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న తనతో అలా ప్రవర్తించడం ఆమెకు కోపం తెప్పించింది. బోండా ఉమ ఆకు రౌడీలా ప్రవర్తించారని మండిపడ్డారామె.


మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ప్రతిస్పదించారు. మహిళ స్థాయిని దిగజార్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను జరిగిన ఘటనను వ్యక్తిగతంగా తీసుకుని ఉంటే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానంలోను ప్రైవేటు వాజ్యాలు వేయగలనని కానీ అలా చేయలేదన్నారు. బోండా ఉమ రాజకీయ నాయకుడు వేషంలోని ఓ కాలకేయుడని... ఇలాంటి కాలకేయుల సైన్యానికి చంద్రబాబు నాయకుడిగా ఉన్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.


మహిళల పట్ల వారు ప్రయోగిస్తున్న భాష, వారి సంస్కృతి అవమానకరంగా ఉందన్నారు. ఈనెల 27న మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని తాము నోటీసులు పంపితే- ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో ధర్నాలు చేయాలని పిలుపునివ్వడం సమస్యను మరింత జఠిలం చేసుకోవడమే అవుతుందన్నారు. బోండా ఉమ తన రాజకీయ రాజకీయ పబ్బం గడుపుకోడానికి జరిపిన నాటకంలో చంద్రబాబు పావు అయ్యారని అన్నారు. అయితే.. ఆమె చంద్రబాబు, బోండా ఉమకు సమన్లు జారీ చేసి.. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.



 దీనిపై బోండా ఉమ మండిపడుతున్నారు. వాసిరెడ్డి పద్మ మేకప్‌ వేసుకుని మహిళలను ఉద్దరిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని బోండా ఉమ అన్నారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబుతో పాటు ఆయన విచారణకు వస్తారా.. రారా.. ఒకవేళ విచారణకు రాకపోతే.. వాసిరెడ్డి పద్మ ఏంచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: