తిరుమలలో టీడీడీ ఏర్పాటు చేసిన పెద్ద తెరలపై సినిమా పాటలు ప్రసారం కావడం ఇప్పుడు వివాదంగా మారింది. తిరుమలలో అక్కడక్కడా స్వామి వారి పాటలు, ఎస్సీబీసీ ఛానల్ చూసేందుకు వీలుగా పెద్ద తెరలు ఏర్పాటు చేశారు. అయితే.. నిన్న సాయంత్రం 5.45 నుంచి 6.15 వరకు సినిమా పాటలు ప్రసారమైనట్టు వార్తలు వచ్చాయి. గోవింద నామాలు ప్రసారమయ్యే తెరలపై సినిమా పాటలు ప్రసారమవడంపై భక్తులు ఆశ్చర్యపోతున్నారు. తిరుమలలోని షాపింగ్ కాంపెక్స్ వద్ద ఎల్ ఈ డీ తెరపై ఈ సినిమా పాటల ప్రసారం అయ్యాయి. అనుకోని ఈ ఘటనతో తిరుమలలో మిగిలిన ఎల్ ఈడీ తెరలను టీటీడీ ఆపేసింది. ఈ వివాదంపై టీటీడీ వివరణ ఇచ్చింది. సెట్ అప్ బాక్స్ లో సాంకేతిక లోపంతో సినిమా పాటలు ప్రసారం అయ్యాయని.. సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఎల్‌ఈడీ తెరలపై ఎస్వీబీసీ ఛానల్ ప్రసారం అవుతోందని వారు వివరించారు.