ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలపై ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది లైంగిక వేధింపుల వార్తలు తరచూ చూస్తూనే ఉంటాం. విద్యాబుద్ధులు చెప్పాల్సిన అయ్యవార్లే తమ కూతుళ్లలాంటి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అందుకే ఏపీ సర్కారు ఇలాంటి వేధింపులకు చెక్ చెప్పనుంది. మహిళా ఉపాధ్యాయులు, బాలికలకు అన్నిరకాల వేధింపులనుంచి రక్షణ కోసం దిశ యాప్ పై అవగాహన పెంచనున్నారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేయించడంతో పాటు వారికి యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోనున్నారు. అలాగే బాల్య వివాహాల నివారణ, మత్తుమందులకు దూరంగా ఉంచడంపైనా దృష్టి సారించాలని నిర్ణయించారు. పోక్సో యాక్ట్‌పై అవగాహన కల్పించాలని.. ఫిర్యాదుల బాక్స్ నిర్వహణ పై అవగాహన పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా విద్యావ్యవస్థలో మహిళా పోలీసులకు భాగస్వామ్యం కల్పించనున్నారు. వీరు అక్కడ నిర్వర్తించాల్సిన విధులపై అధికారులు ఎస్‌ఓపీ రూపొందించారు.