ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. రాష్ట్ర మంత్రులంతా ఈ కేబినెట్‌లోనే రాజీనామాలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. పదవి పోతుందని.. తిరిగి మంత్రి పదవిలో కొనసాగలేమని చాలా మంది మంత్రులు నిర్ణయానికి వచ్చారు. అందుకే తమ శాఖకు చెందిన అధికారులు, కలసి పనిచేసిన అధికారులకు వీడ్కోలు చెబుతున్నారు. చివరి సారిగా అధికారికంగా సమావేశం అవుతున్నారు. కృష్ణా జిల్లా మంత్రి పేర్నినాని తన ఆధీనంలో ఉన్న విభాగాల ఉన్నతాధికారులతో నిన్న సమావేశమయ్యారు. విజయవాడ ఆర్టీసీ హౌస్ లో జరిగిన భేటీలో రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో భేటీ అయ్యారు. అంతే కాదు.. గతంలో ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సురేంద్ర బాబుతోనూ సమావేశం అయ్యారు. వీరే కాదు.. ఆర్టీసీ, రవాణా ఉన్నతాధికారులు, సమాచార శాఖ కమిషనర్ విజయ కుమార్ , గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఇంతియాజ్ అహ్మద్ ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు.