హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ దూసుకుపోతున్నారు. ఆయన హవా స్పష్టంగా ప్రతి చోటా కనిపిస్తోంది. తొలి రౌండ్లో ఈటెల కు 4610 ఓట్లు రాగా, గెల్లు శ్రీనుకు 4444 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ కు 119 ఓట్లు రాగా, ప్రజా ఏక్తా పార్టీ శ్రీకాంత్ కు 122 ఓట్లు పోల్ అయ్యాయి. ముందు నుంచి ఆగ్రహంతోనో ఆవేశంతోనో ఊగిపోయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభావం ఈ ఎన్నికలపై లేనేలేదని స్పష్టం అయిపోయింది. కేసీఆర్ ను అనరాని మాటలు అన్నా కూడా ఓటరు అస్సలు అవేవీ పట్టించుకోలేదు. ముఖ్యంగా అభ్యర్థి ఎంపిక విషయమై మొదట్నుంచి పెద్దగా స్పష్టత పాటించని రేవంత్ ఆఖరినిమిషంలో ప్రకటించినా కూడా ఫలితం అన్నది లేకుండా పోయింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కని విధంగా ఇప్పుడక్కడ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన బల్మూరు వెంకట్ కు స్వతంత్ర అభ్యర్థి కన్నా మూడు ఓట్లు తక్కువ వచ్చాయి. ఇది తొలి రౌండ్ ఫలితం. ఎన్ ఎస్ యూఐ నేతగా పేరున్న వెంకట్ మొదటి నుంచి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపే వ్యక్తి కాదనే తేలిపోయింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈయననే సమర్థించాడు. అభ్యర్థి ఎంపిక కూడా ఒకంతట తేలనివ్వక, తేల్చనివ్వక సీనియర్ లీడర్ దామోదర రాజనర్సింహతో కూడిక కమిటీ మీనమేషాలు లెక్కపెట్టింది. ఈ విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈటెలకు పోటీ ఇచ్చే మొనగాడే కాంగ్రెస్ లో లేడని తేలిపోయింది. ఇక రేవంత్ మాటలు శుద్ధ దండగ అని కూడా స్పష్టం అయిపోయింది. కొత్త పీసీసీ చీఫ్ సాధించింది నిండు సున్నా అని ఇక సోనియా కూడా ఓ నిర్థారణకు వచ్చేయొచ్చు.