ఇప్పటికైనా మౌనం వీడండి మోడీజీ?
లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. మీరు ప్రతిపక్షంలో ఉంటే ఇలాగే మౌనంగా ఉండేవారా? అన్నారు. మీనుంచి కాస్తంత సానుభూతిని ఆశిస్తున్నామని, మీకు అదేమంత కష్టం కాబోదన్నారు. లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేస్తున్న రైతులపైనుంచి కేంద్రమంత్రి కొడుకు కాన్వాయ్ దూసుకువెళ్లింది. ఈ సంఘటనలో నలుగురు రైతులతోపాటు మొత్తం ఎనిమిది మంది మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. దుర్ఘటన జరిగి ఐదురోజులవుతున్నప్పటికీ ఇంతవరకు ప్రధానమంత్రి మోడీ నోరు విప్పలేదు. కనీసం మృతిచెందిన రైతులకు సానుభూతి వచనాలు కూడా పలకలేదు. అది భారతదేశంలోకాదు పాకిస్తాన్‌లో జరిగిన సంఘటన అన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తనయుడు ఆశిష్‌మిశ్రా భారత్-నేపాల్ సరిహద్దులోని ఓ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రశ్నించేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆశిష్‌కు సమన్లు జారీచేశారు. ప్రస్తుతం ఆయన ఉన్న ప్రాంతం లఖింపూర్ ఖేరికి దగ్గరలోనే ఉంది.