చినుకు పడిందంటే చాలు హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయి. ఈ రోజు కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే వర్షం కారణంగా మలక్ పేట ప్రధాన రహదారిపై తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో ట్రాఫిక్ లో 5 అంబులెన్స్ లు చిక్కుకున్నాయి. దాంతో ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ట్రాఫిక్ లో ఐదు అంబులెన్స్ లు చిక్కుకుపోవడంతో వెంటనే మలక్ పేట్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు.
అంబులెన్స్ ల కోసం ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. పోలీసులు రోడ్లపై పరుగులు తీస్తూ ట్రాఫిక్ లో వాహనాలను పక్కకు తప్పిస్తూ కష్టపడ్డారు. దాంతో ఎట్టకేలకు ట్రాఫిక్ క్లియర్ చేసి 5 అంబులెన్స్లను పంపించారు. కాగా పోలీసులు సరైన సమయంలో ట్రాఫిక్ ను క్లియర్ చేయడం పై వాహనదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్ ట్రాఫిక్ పోలీస్ అంటున్నారు.