ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వాలు ఫోన్ హ్యాకింగ్ కు పాల్పడుతున్నాయన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సమాజం మేలు కోరుతూ పని చేసే వారి ఫోన్లను హ్యాక్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందన్నారు. దేశంలో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారాన్ని వాట్సాప్ సంస్థ 2019లోనే హెచ్చరించిందని గుర్తు చేశారు. అయితే కేంద్రం దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు రేవంత్. అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోమ్ మంత్రి అమిత్ షా అడ్డదారులు తొక్కుతున్నారని... వారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కూడా ప్రతిపక్ష నేతలు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోన్లు, ప్రముఖ విలేకరుల ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం హ్యాకింగ్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ హ్యాకింగ్ కు వ్యతిరేకంగా ఈ నెల 22న ఉదయం 11 గంటలకు తెలంగాణలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ... కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని... అప్పుడే విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందన్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకరరావు వ్యవహారశైలి, ఆయన నియామకంపై కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు రేవంత్.