రైతు బంద్.. బ్యాంకుల పరిస్థితేంటి..?
ఒకవేళ రైతు బంద్ కార్యక్రమంలో బాంక్ ఉద్యోగులు కూడా పాల్గొంటే బ్యాంకులు కచ్చితంగా పని చేయవు. దీంతో బ్యాంకు వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో బంద్ అంశంపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు స్పష్టమైన వివరణ ఇచ్చాయి. తాము రైతు బంద్ కార్యక్రమంలో పాల్గొనడం లేదని తేల్చి చెప్పాయి.
బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ..
రైతులకు తాము కేవలం సంఘీభావం మాత్రమే ప్రకటించామని, భారత్ బంద్‌లో నేరుగా పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. రైతులకు మద్దతుగా పని గంటల ముందు, తర్వాత నిరసన వ్యక్తం చేస్తామని వివరణ ఇచ్చారు. అంతే కాకుండా నల్లరంగు బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని తెలిపారు.
అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ) జనరల్ సెక్రెటరీ సౌమ్య దత్తా మాట్లాడుతూ.. రైతులు చేపట్టిన భారత్ బంద్‌కు మా ఉద్యోగ సంఘం కచ్చితంగా మద్దతు ఇస్తుందని తెలిపారు. అలాగే అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ.. తాము ధర్నాలు చేపట్టడం లేదని, బంద్‌లో పాల్గొనడం లేదని, అయితే విధులకు మాత్రం నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరవుతామని, ఆ విధంగానే రైతు బంద్ కు మద్దతు తెలుపుతామని వెల్లడించారు. బ్యాంకు వినియోగదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.