కరోనా పై యుద్ధం: దేశంలో మూడు జోన్లు.. మోడీ ఏం చెబుతారో..!
కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి.. కరోనా వైరస్ ప్రభావం దేశమంతటా ఒకేతీరుగా లేదు. దేశంలో దాదాపుగా కేవలం 9 రాష్ట్రాల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే దేశంలో 196జిల్లాలను రెడ్‌జోన్‌లో చేర్చిన విషయం తెలిసిందే. దాదాపుగా 400 జిల్లాల్లో కరోనా ప్రభావం లేదు. ఈ నేపథ్యంలో దేశాన్ని మూడు జోన్లుగా విభజించి, లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కరోనా కేసులను బట్టి రెడ్ ( కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియా), ఆరెంజ్ (తీవ్రత మధ్యస్థంగా ఉన్న ఏరియా) , గ్రీన్ (తీవ్రత తక్కువగా ఉన్న ఏరియా) జోన్లుగా విభజించనున్నట్టు పేర్కొన్నాయి. వీటి ఆధారంగా లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఆరెంజ్, గ్రీన్ జోన్లలోని కొన్ని పరిశ్రమలు తమ కార్యకలాపాల్ని కొనసాగించుకోవడానికి కొంత సడలింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే, వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల్ని అనుమతించే యోచనలో ఉన్నట్టు వివరించాయి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇదే సమయంలో నిర్ణీత దూరం వంటి నిబంధనల్ని అందరూ పాటించాలని సూచించారు. ఇక ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఏం చెబుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకేరీతిలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా..? లేక కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి సడలింపులు ఇస్తారా..? అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్నటి ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌లో మాత్రం ప్రజల ప్రాణాలతోపాటు ఆర్థిక వ్యవస్థా ఎంతో ముఖ్యమని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం లేదా.. సోమవారం మోడీ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.