15 ఏళ్లకే మొదలెట్టేసిన మిల్కీ బ్యూటీ!

Vimalatha
తమన్నా నిస్సందేహంగా దక్షిణాదిలో అత్యంత ఇష్టపడే నటీమణులలో ఒకరు. ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తన అభిమానులను సంపాదించుకోగలిగింది. ఈ మిల్కీ బ్యూటీ తన అద్భుతమైన ఫొటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. ఆమె సినిమాల్లో దశాబ్ద కాలానికి పైగా సందడి చేస్తున్నా ఇప్పటికీ తమన్నా హవా తగ్గలేదనే చెప్పాలి. ఈరోజు తమన్నా పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తమన్నా భాటియా 1989 డిసెంబర్ 21న జన్మించింది. అయితే తమన్నా భాటియా తన 15 సంవత్సరాల వయస్సులో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆమె మొదటి చిత్రం ఘోరంగా పరాజయం పాలైంది. అయినా ఆమె పట్టు వదలలేదు... నమ్మకంతో కెరీర్లో ముందుకు సాగింది.
తమన్నా భాటియా 15 ఏళ్ల వయసులో నటించిన చిత్రం 'చాంద్ సా రోషన్ చెహ్రా' సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తమన్నా కొన్ని వీడియో ఆల్బమ్‌లకు కూడా చేసింది. అనంతరం తమన్నా తెలుగు, తమిళ చిత్రాల వైపు మళ్లింది. తమన్నా 2005లో 'శ్రీ' అనే తెలుగు చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాకపోయినా, కొన్ని అవకాశాలను ఆమెకు తెచ్చి పెట్టడానికి సహాయ పడింది. ఆ తరువాత తమన్నా కూడా తన ప్రతిభతో ఒకదాని తర్వాత మరొకటి విజయాన్ని అందుకుంది. 'హ్యాపీ డేస్' విజయం అందుకున్న తమ్మూ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోలతో జత కట్టి అనతి కాలంలోనే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ అయిపోయింది.
2013లో హిందీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది తమన్నా. ఆమె 'హిమ్మత్‌వాలా' చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి పని చేసింది. ఈ సినిమా మళ్ళీ ప్లాప్ అయ్యింది. దీని తర్వాత 2014లో అక్షయ్ కుమార్ నటించిన 'హమ్‌షకల్స్' చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించింది. ఆమె తదుపరి చిత్రం 'ఎంటర్‌టైన్‌మెంట్'లో కూడా అక్షయ్‌తో కలిసి పనిచేసింది. తమన్నా నటించిన కొన్ని సినిమాలు హిట్ అయితే కొన్ని ఫ్లాప్ అయినా ఆమె పాపులారిటీ మాత్రం అలాగే ఉంది. 'బాహుబలి' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. ఈ సినిమాలో తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. 'నవంబర్ స్టోరీ' అంటూ డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు అక్కడ కూడా మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పటికీ మిల్కీ బ్యూటీకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదన్నది మాత్రం వాస్తవం !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: