పళ్ళు తెల్లగా మెరవాలంటే ఏం చేయాలో తెలుసా..!
సాధారణంగా పళ్ళు తెల్లగా మెరవాలంటే, పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు బొగ్గు, ఉప్పును కలిపి మెత్తగా పొడి చేసుకొని, వాటితో పళ్ళు తోముకునే వారు. అప్పట్లో ఎలాంటి పేస్ట్ కానీ బ్రష్ కానీ ఉపయోగించేవారు కాదు. అందుకే వారు కేవలం ఈ రెండిటిని ఉపయోగించి మాత్రమే పళ్ళని తెల్లగా చేసుకునేవారు. అంతే కాకుండా వేప పుల్లలతో పళ్ళు తోమేవారు. అందుకే వాళ్ల పళ్ళు బలంగా, గట్టిగా ఉండేవి. అప్పుడప్పుడు పసుపుతో కూడా పళ్లు తోమడం మొదలు పెట్టారు. పసుపు యాంటీబయోటిక్ అని మనందరికీ తెలుసు.
పసుపు కేవలం యాంటీబయాటిక్ గా మాత్రమే పని చేయకుండా, ఒక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించబడేది. పూర్వ కాలంలో కూడా కేవలం పసుపును మాత్రమే ఉపయోగించి, వారు అందం గా మారే వారు. కానీ ఇప్పుడు కూడా పసుపును అన్ని కాస్మెటిక్స్ లో కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. పసుపు ముఖానికి రాసుకోవడం ద్వారా మొటిమలు,మచ్చలు పోయి చర్మం నిగనిగలాడుతుంది. అయితే పసుపుతో కేవలం ముఖం మాత్రమే కాదు పళ్ళు కూడా తెల్లగా మారేలా చేయవచ్చు. అంతేకాకుండా పన్ను పోటు,చిగుళ్ళవాపు,సున్నితత్వం వంటి పలు సమస్యలను కూడా దూరం చేస్తుంది.
ప్రధానంగా పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఎక్కువ ఔషధాలను కలిగి ఉంటుంది. కాబట్టి పసుపుతో దంతాలను తోముకోవడం వల్ల దంతక్షయం,చిగుళ్ల సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే పసుపును డైరెక్ట్ గా కాకుండా కొద్దిగా కొబ్బరి నూనెలో కలుపుకొని పళ్లు తోమడం వల్ల పంటిపై గార కూడా తొలగి, పళ్లలో ఉండే బ్యాక్టీరియా తో పోరాడి,పంటి సమస్యలను దూరం చేసి, పళ్ళు తెల్లగా మెరుస్తూ ఉండేలా చేస్తుంది.
అయితే ఈ పద్ధతి ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. ఒకవేళ పసుపు తో పళ్ళు తోముకో లేము అన్న వాళ్ళు, కొంచెం పసుపును నీళ్లలో కలుపుకుని ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల కూడా పంటి సమస్యలు తొలగిపోయి పళ్ళు మెరుస్తూ ఉంటాయి.