"ఛ‌త్ర‌ప‌తి శివాజీ" కోసం జీఎంఆర్‌?

Garikapati Rajesh

దేశంలోని అత్యంత ర‌ద్దీ రైల్వేస్టేష‌న్ల‌లో ఒక‌టైన ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌ (సీఎస్‌ఎంటీ)ను  అభివృద్ధి చేసి, దాన్ని నిర్వహించే కాంట్రాక్టును దక్కించుకోడానికి గ్రంథి మ‌ల్లికార్జున‌రావు (జీఎంఆర్‌) గ్రూపు ప్రయత్నిస్తోంది. దీని కోసం ఐఆర్‌ఎస్‌డీసీ (ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) చేపట్టిన బిడ్డింగ్‌ ప్రక్రియలో తొమ్మిది సంస్థలు ఎంపికయ్యాయి. ఇందులో జీఎంఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు అదానీ రైల్వే ట్రాన్స్‌పోర్ట్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఓబరాయ్‌ రియాల్టీ, ఐఎస్‌క్యూ ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, యాంకరేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హోల్డింగ్స్‌, బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌, మారిబస్‌ హోల్డింగ్స్‌ ఉన్నాయి.
1642 కోట్ల‌ రూపాయల‌ అంచ‌నా వ్య‌యం!
ప్రాథ‌మిక ద‌శ‌లో ఎంపికైన ఈ సంస్థ‌ల‌న్నీ ఇప్పుడు ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) దాఖలు చేయాల్సి ఉంటుంది. చివరిగా ఎంపికైన సంస్థకు డీబీఎఫ్‌ఓటీ (డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌) పద్దతిలో ఈ కాంట్రాక్టు లభిస్తుంది. సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి ప్రాజెక్టు విలువ రూ,1,642 కోట్లుగా అంచనా వేశారు. బిడ్డింగ్‌ ప్రక్రియను గత ఏడాది ఆగస్టులో ప్రారంభించ‌గా 9 సంస్థలకు ఆర్‌ఎఫ్‌పీ దాఖలు చేసే అవకాశం లభించింది. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు భాగ‌స్వామ్యం కింద అప్రైజల్‌ కమిటీ ఆమోదం తీసుకున్న తర్వాత, ఒక్కో స్టేషన్‌కు బిడ్డింగ్‌ ప్రక్రియను ఐఆర్‌ఎస్‌డీసీ చేపడుతోంది. సీఎస్‌టీ అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
విక్టోరియా టెర్మిన‌స్ నుంచి ఛ‌త్ర‌ప‌తి శివాజీగా..
క‌న్సల్టింగ్ ఆర్కిటెక్ట్ అయిన "ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్ష‌, ఈ స్టేష‌న్ డిజైన్ రూపొందించి, 16.14 లక్షల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఓడ‌రేవు అవ‌స‌రాలు తీర్చ‌డానికి అప్ప‌టి బ్రిటీష్ ప్ర‌భుత్వం దీన్ని నిర్మించింది. బోరీబంద‌ర్ రైల్వేస్టేష‌న్ స్థానంలో కొత్త‌గా నిర్మించి దీన్ని అభివృద్ధి చేశారు. 1878లో నిర్మాణం ప్రారంభ‌మై 1887లో పూర్త‌యింది. విక్టోరియా రాణి గౌరవార్థం దీనికి "విక్టోరియా టెర్మినస్" అనే పేరు పెట్టారు.1996 లో శివసేన పార్టీ డిమాండ్ మేర‌కు దీనికి "ఛత్రపతి శివాజీ" పేరును ఖ‌రారు చేశారు. 2004 జూలై 2న ఈ స్టేషనును యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇంత‌టి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్న స్టేష‌న్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందోన‌నే ఆస‌క్తి దేశ వ్యాపార‌వ‌ర్గాల్లో నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gmr

సంబంధిత వార్తలు: