చావు కబురు చల్లగా చెప్పిన సిద్ధార్థ్‌!

N.Hari
సాధారణంగా ఎవరైనా ఎదురుబదురుగా వాదులాడుకుంటూ నోటి మాటగా- "నువ్వు  బతికినా.. నాకు చచ్చినట్టే లెక్క" అని అంటుంటారు. అలాంటప్పుడు ఆ మాట అనిపించుకున్నవారికి మనసు చివుక్కుమంటుంది. కొందరికి పట్టరానంత కోపం కూడా వస్తుంది. ఇక అప్పుడప్పుడు ఎవరైనా ప్రముఖులు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు... కొన్ని న్యూస్‌ చానెళ్లు తొందరపాటుతో వారు బతికుండగానే చనిపోయారని ప్రసారం చేస్తాయి. ఇది తెలిసి వారి అభిమానులు, బంధువులు.. సదరు సంస్థలపై దాడులకు ప్రయత్నించడం, కోర్టుల్లో కేసులు వేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. అయితే హీరో సిద్ధార్థ్‌ మాత్రం తన చావు కబురు చల్లగా చెప్పారట. తనను బతికుండగానే చనిపోయినట్లు ఒక న్యూస్‌ యూట్యూబ్‌లో ఉందని తెలిసి కూడా.. దానిపై అతను పెద్దగా రియాక్ట్‌ కాలేదు. అయితే ఆ విషయాన్ని ఒక నెటిజన్‌ పోస్ట్‌ చేయడంతో.. ఇది నాకు ముందే తెలుసునని సిద్ధార్థ్‌ చెప్పాడు.


అసలు ఏం జరిగిందంటే, ఇటీవల యుక్తవయసులో చనిపోయిన పది మంది సౌత్‌ ఇండియన్ సెలబ్రిటీలు అని రాసి ఉన్న వీడియో థంబ్‌ నెయిల్‌ ఫోటోను కోడ్‌ చేస్తూ ఒక నెటిజన్‌ సోషల్‌ మీడియాలో సెటైరిక్‌గా పోస్ట్‌ చేశాడు. ఆ థంబ్‌ నెయిల్‌పై హీరోయిన్లు సౌందర్య, ఆర్తి అగర్వాల్‌తో పాటు హీరో సిద్ధార్థ ఫోటో కూడా ఉంది. దీనిపై సిద్ధార్థ్‌ వ్యంగ్యంగా స్పందించినట్లుగా పోస్ట్‌ను తయారు చేశారు. "అయ్య బాబోయ్‌, నేను చనిపోయా అని తెలియక ఇంకా సినిమాలు తీస్తున్నా.. నన్ను క్షమించండి అంకుల్‌ ప్లీజ్‌" అంటూ సెటైరికల్‌గా రాసి సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ బాగా వైరల్‌ అయింది.


అయితే హాయిగా నిక్షేపంలా బతికే ఉన్న హీరో సిద్ధార్థ్‌ను యుక్త వయసులో చనిపోయినవారి జాబితాలో చేర్చడాన్ని చూసిన నెటిజన్లు.. ఇదేమి అరాచకం అని కామెంట్లు చేశారు. ఇవి కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్ట్‌ హీరో సిద్ధార్థ్‌ కంట పడింది. దీంతో సిద్ధార్థ్‌.. ఈ విషయం తనకు ముందే తెలుసునని ట్వీట్‌ చేశాడు. ఇది తెలిసి తాను ఏం చేశాననే విషయాన్ని కూడా అందులో వివరించాడు. తాను ఈ వీడియోని కొన్నాళ్ల క్రితమే చూసి.. దానిపై యూట్యూబ్‌ నిర్వాహకులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. అయితే ఈ వీడియో వల్ల ఎలాంటి సమస్యా లేదని వారు ఇచ్చిన జవాబుకు మనసులోనే తిట్టుకున్నానన్నాడు. అయితే సిద్ధార్థ్‌.. తన చావు కబురుని చాలా నింపాదిగా చెప్పినట్లుగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: