సేవ్ గాళ్ చైల్డ్ నినాదం మాత్రమే!

RATNA KISHORE
ఏటా అక్టోబ‌ర్ 11 న‌ సేవ్ గాళ్ చైల్డ్ అన్న నినాదం ఒక‌టి వినిపిస్తుంది. విసిగిస్తుంది కూడా! అయినా మ‌నం ఏడ్పుగొట్టు జీవితాల్లో ఉంటాం. మ‌న‌లో మార్పు అన్న‌వి ఏవీ ఉండ‌వు. క‌నుక నినాదాలంటే విసుగు. ఆచ‌ర‌ణ కు అంద‌ని చ‌ర్యే ఇప్ప‌టి విసుగు లేదా విర‌క్తికి కార‌ణం.
ఏటా మ‌నం చేసుకునే పండుగల్లో ఎక్కువ‌గా స్త్రీ ప్రాధాన్యమే ఎక్కువ‌. పండుగ రోజుల్లోనే కాదు మ‌న జీవితంలోనూ స్త్రీ ప్రాధాన్య‌మే ఎక్కువ. మారుతున్న కాలంలో  విప‌రీతంగా పెరిగిపోతున్న టెక్నాల‌జీ కార‌ణంతో ఎన్నెన్నో అకృత్యాలు జ‌రుగుతున్నాయి. వీటిపై వార్త‌లు వ‌స్తున్నా, కేసులు న‌మోద‌వుతున్నా ప‌ట్టించుకునే నాథుడే లేడు. ఎన్కౌంట‌ర్లు ఏవీ బాధిత వ‌ర్గాల్లో ధైర్యం నింప‌లేక‌పోతు న్నాయి. ఈ దశ‌లో భ్రూణ హ‌త్య‌లను కానీ నేర‌మయ ప్ర‌పంచాన్ని కానీ  ఎవ్వ‌రూ అడ్డుకోలేక అచేత‌నంగా చూస్తూ ఉండిపోతు న్నారు. బాల బాలికల నిష్ప‌త్తి ఒక్క శ్రీ‌కాకుళం జిల్లానే చూసుకుంటే ప్ర‌తి వెయ్యి మంది బాలుర‌కు  953 మంది బాలిక‌లు ఉన్నారు. బాలికా సంర‌క్ష‌ణ‌కు, వారి ర‌క్ష‌ణ‌కు, పోష‌ణ‌కు వివిధ ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నా అయిన వారే కొంద‌రికి శ‌త్రువులు అవుతున్నారు. వారి క‌న్నీళ్ల‌కు కార‌ణం అవుతున్నారు. అయిన వారే నేరాల‌కు పురిగొల్పుతున్నారు. వారే విల‌న్లు కూడా! ఈ ద‌శ‌లో బిడ్డ‌ల ర‌క్ష‌ణ అన్న‌ది ఇప్ప‌టి త‌ల్లుల‌కు స‌వాల్ తో కూడుకున్న ప‌ని. చైల్డ్ ఎబ్యూజ్ పై కేసులు పెరుగుతున్నా, విమెన్ ఎబ్యూజ్ పై కేసులు పెరుగుతున్నా ఇవ‌న్నీ స‌మాజాన్ని మేల్కొల్ప‌డం లేదు స‌రిక‌దా కొత్త కొత్త సమ‌స్య‌లు కొన్ని నెత్తిన తెచ్చి పెడుతున్నాయి.  ఈ ద‌శ‌లో సేవ్ గాళ్ ఛైల్డ్ అన్న‌ది నినాదం మాత్రమే!

ఆడ‌పిల్ల‌ను చ‌ద‌వనిద్దాం, ఎద‌గ‌నిద్దాం, కాపాడుకుందాం అన్న‌వి నినాదాలే త‌ప్ప అవి అమ‌లులో ఉండ‌డం లేదు. రోజు రోజుకూ జెం డ‌ర్ ఈక్వాలిటీ అన్న‌ది లేకుండా పోతున్నా, వీటిపై దృష్టి పెట్టాల్సిన ప్ర‌భుత్వం అవేవీ ప‌ట్టించుకోవ‌డం లేదు. భ్రూణ హ‌త్య‌లు, అత్యాచారాలు, హ‌త్య‌లు పెరిగిపోతున్న దేశంలో సేవ్ గాళ్ చైల్డ్ అన్న‌ది ఓ నినాదం మాత్ర‌మే! అంతేకాదు రోజు రోజుకూ బాలురు, బాలిక‌ల నిష్ప‌త్తి కూడా ఆశించిన స్థాయిలో ఉండ‌డం లేదు. ఆడ బిడ్డ‌ల ర‌క్ష‌ణ కోసం ముఖ్యంగా క‌డుపులో ఉన్న బిడ్డ‌లను చిదిమేయకుండా ఉండ‌డం కోసం కౌన్సిలింగ్ సెంట‌ర్లు ఎన్ని ఉన్నా, లేదా మ‌హిళా పోలీసు ఎంత‌గా ప‌నిచేస్తున్నా ఫ‌లితం మాత్రం ఆశించిన స్థాయిలో రావ‌డం లేదు. ముఖ్యంగా స్కానింగ్ సెంట‌ర్ల‌పై నిఘా లేదు. ఆడ‌బిడ్డ‌ల పెంపకం, పోష‌ణ అన్న‌వి త‌మ‌కు ఇబ్బందిగా ఉంటుద‌న్న ఆలోచన‌తో కొంద‌రు పుట్ట‌గానే ఏ చెత్త కుప్ప‌ల్లోనో, మురికి కాలువ‌ల్లోనో విసిరేస్తున్నారు. అదేవిధంగా ఆడబిడ్డ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడులు కానీ లైంగిక నేరాలు కానీ అనేకం న‌మోద‌వుతున్నా వీటిని నియంత్రించాల‌న్న ఆలోచ‌న కానీ ప‌ట్టింపు కానీ లేనే లేదు రాజ‌కీయ వ‌ర్గాల‌కు. అదేవిధంగా నేర నియంత్ర‌ణ కూడా క‌ష్ట సాధ్య‌మే అవుతోంది. ప‌నిచేసే చోట లైంగిక వేధింపుల క‌ట్ట‌డి కూడా త‌ల‌కుమించిన భారంగానే ఉంది సంబంధిత యంత్రాంగాల‌కు. దీంతో సెమినార్లు, స‌ద‌స్సులు ఎన్ని నిర్వ‌హించినా ఆడ‌బిడ్డ‌ల‌పై జ‌రుగుతున్న నేరాల అదుపు అన్న‌ది కుద‌ర‌ని ప‌నిగానే తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: