నేడు ప్రారంభం కానున్న బ‌తుక‌మ్మ పండుగ

N ANJANEYULU

తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల పండుగ "బ‌తుక‌మ్మ‌" బుధ‌వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించనున్నారు. మొద‌టిరోజు ఎంగిలి పువ్వుల బ‌తుక‌మ్మ‌తో ప్రారంభ‌మై.. చివ‌రి రోజు స‌ద్దుల బ‌తుక‌మ్మ‌తో సంబ‌రాలు ముగుస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి బ‌తుక‌మ్మ పండుగ‌ను అధికారికంగా జ‌రుపుతోంది. గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా బ‌తుక‌మ్మ పండుగ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించ‌లేదు. ఏ సంవ‌త్స‌రం క‌రోనా నుంచి కోలుకోవ‌డంతో ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తోంది. మ‌రోవైపు బ‌తుకమ్మ పండుగ సంద‌ర్భంగా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ సంగీతంలో, ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాట‌ను విడుద‌ల చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో రూపొందించారు అల్లిపూల వెన్నెల అనే బ‌తుక‌మ్మ పాట ప్ర‌సిద్ధ గాయ‌ని ఉత్త‌రా ఉన్ని కృష్ణ‌న్ ఆల‌పించారు.
ఊరూరు, వాడ వాడలా ఉన్న మైదానాల వ‌ద్ద బ‌తుక‌మ్మ పండుగ ఏర్పాటు చేయ‌డంతో పాటు.. కుంట‌లు, చెరువుల వ‌ద్ద బ‌తుక‌మ్మ ఘాట్‌ల‌ను ఏర్పాటు చేసి నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ప‌లు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది. బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా మ‌హిళ‌లంద‌రికీ తెలంగాణ  గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర్ రాజ‌న్‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ బ‌తుక‌మ్మ వేడుక నిర్వ‌హించుకోవాల‌ని సూచించారు. సీజ‌న‌ల్ గా ల‌భించే పూల‌తో అలంక‌రించే బ‌తుక‌మ్మ‌లో వ‌ర్ష‌పు నీటిని శుభ్రం చేసే ఔష‌ద గుణాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు.
తెలంగాణ సాంస్కృతిక ప్ర‌తీక‌, రాష్ట్ర పండుగ బ‌తుక‌మ్మ ప్రారంభం సంద‌ర్భంగా తీరొక్క పూల‌ను పేర్చుకొని తొమ్మిది రోజుల పాటు ప్ర‌కృతిని ఆరాధిస్తూ... ఆనందోత్స‌వాల మ‌ధ్య ఆట‌, పాట‌ల‌తో ఆడ‌బిడ్డ‌లు బ‌తుక‌మ్మ‌ను ఆడుతుంటార‌ని సీఎం కేసీఆర్‌ వెల్ల‌డించారు. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌జ‌లు సుఖ‌, సంతోషాలు ఆయురారోగ్యాల‌తో దీవించాల‌ని అమ్మ‌వారిని వేడుకుంటున్న‌ట్టు చెప్పారు. తెలంగాణ సంస్కృతికి బ‌తుక‌మ్మ పండుగ విశ్వ‌వ్యాప్తంగా గుర్తింపును తెచ్చింద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంట‌లు నీటితో నిండుగా ఉన్నాయ‌ని.. బ‌తుక‌మ్మ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: