అమ్మ: కరోనా సమయం గర్భిణులకు పరీక్షేనా..?

N.ANJI
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ క్లిష్ట సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గర్భిణులు కడుపులో బిడ్డను మోస్తుంటారు కాబట్టి, వీరిలో రోగ నిరోధక శక్తి కొంత తక్కువగానే ఉంటుంది. కాబట్టి, కరోనా వేగంగా సోకే ఆస్కారం ఉంది. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
కరోనా సోకిన సాధారణ ఆరోగ్యవంతులకూ, గర్భిణులకూ చికిత్స విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. తల్లితో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక గర్భిణులు కూడా జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు సొంత వైద్యం చేసుకో కూడదు. రెండు మూడు రోజులైనా లక్షణాలు వదలకపోతే కరోనా పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడాలి. ఇతరుల మాదిరిగానే వీరు కూడా పూర్తి ఐసొలేషన్‌లోనే ఉండాలి. ఒకవేళ పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆసుపత్రిలో చేరడం ఉత్తమం. అక్కడ, డాక్టర్లే జాగ్రత్తగా చూసుకుంటారు.
ఒకవేళ పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలినా ఆందోళన పడకూడదు. ఆందోళన వల్ల ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గర్భిణికి కరోనా పాజిటివ్‌ వచ్చినా, గర్భంలోని పిండానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. పిండానికి కరోనా సోకే ఆస్కారమే లేదు. గర్భంలోని మాయ పిండానికి రక్షణ కవచంగా ఉంటుంది. డెలివరీ అయ్యాక తల్లి నుంచి పిల్లకు సోకితే చెప్పలేం కానీ, గర్భంలో ఉండగా మాత్రం పిండానికి కరోనా సోకదు.
ఇక ప్రస్తుత విపత్కర సమయంలో గర్భిణులు పదేపదే ఆసుపత్రుల వెంట తిరగడం మంచిది కాదు. తీవ్ర సమస్య ఉన్నవారు మాత్రం డాక్టర్‌ సూచన ప్రకారం దవాఖనకు రావాల్సిందే. అయితే గర్భిణులు 3,5,7 నెలల్లో తప్పనిసరిగా డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిందే. మరో ముఖ్య విషయం, నార్మల్‌ చెకప్‌ కోసం కానీ డెలివరీ సమయంలో కానీ పేషెంట్‌తో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది రావొద్దు. దీని వల్ల డాక్టర్లకు ఇబ్బంది కలగడంతో పాటు, అక్కడికి వచ్చిన వారికి కరోనా సోకే ఆస్కారం ఉంటుంది. మరీ ముఖ్యంగా తల్లి, పిల్లకు సేవ చేసే వారికి కరోనా సోకే ప్రమాదం మరీ ఎక్కువ అని ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: